Headlines

Duleep Trophy: బ్యాట్ పట్టాడంటే బాదుడే.. 167 పరుగులతో తిలక్ వర్మ ఊచకోత.. ఫైనల్లో ఇషాన్‌తో ఫైట్!


Duleep Trophy: దేశవాళీ తొలి క్రికెట్ సమరంలో దులీప్ ట్రోఫీ 2026 ఫైనలిస్టులు ఖరారయ్యారు. బెంగళూరు వేదికగా జరిగిన రెండవ సెమీఫైనల్లో నార్త్ జోన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి సౌత్ జోన్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. కెప్టెన్ తిలక్ వర్మ రెండు ఇన్నింగ్సుల్లోనూ కలిపి 167 పరుగులు సాధించి జట్టును విజయతీరాలకు చేర్చాడు. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ మైదానంలో బుధవారం సెప్టెంబర్ 2న ముగిసిన సెమీఫైనల్ పోరు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. నార్త్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 297 పరుగులకు ఆలౌట్ కాగా, తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 117 పరుగుల ఆధిక్యం సౌత్ జోన్‌కు ఎంతగానో కలసివచ్చింది. దీంతో సౌత్ జోన్ ముందు 182 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఛేజింగ్‌లో ఓపెనర్లు రికీ భుయ్, నారాయణ్ జగదీషన్ మొదటి వికెట్‌కు 64 పరుగులు జోడించి మంచి పునాది వేశారు.

కెప్టెన్సీ మార్క్ ఇన్నింగ్స్‌తో మెరిసిన తిలక్

ఒక దశలో 102 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి సౌత్ జోన్ కాస్త ఒత్తిడిలో పడింది. ఆట ఏ మలుపైనా తిరిగే అవకాశం ఉన్న తరుణంలో కెప్టెన్ తిలక్ వర్మ క్రీజులోకి వచ్చి బాధ్యతాయుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతమైన సెంచరీతో జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించిన తిలక్, రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన సమయంలో 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆఖరిలో విన్నింగ్ ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 116, రెండో ఇన్నింగ్స్‌లో 51 పరుగులతో మ్యాచ్‌ మొత్తం 167 రన్స్ చేసి సౌత్ జోన్ విజయానికి కీలక సూత్రధారిగా నిలిచాడు.

ఇషాన్ వర్సెస్ తిలక్ బిగ్ ఫైట్

ఈసారి దులీప్ ట్రోఫీ ఫైనల్ సమరం భారత క్రికెట్ భవిష్యత్తు కోణంలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఈస్ట్ జోన్ జట్టును ఇషాన్ కిషన్ ఫైనల్‌కు చేర్చగా, ఇప్పుడు సౌత్ జోన్‌ను తిలక్ వర్మ ముందుకు నడిపించాడు. టీమిండియా టీ20 జట్టులో వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తిలక్ వర్మ రాబోయే వన్డే ప్రపంచకప్ 2027 పోటీలో రేసులో ఉన్నాడు. మరోవైపు వికెట్ కీపర్ బ్యాటర్‌గా తిరిగి స్థానం సంపాదించేందుకు ఇషాన్ కిషన్ శ్రమిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *