Headlines

Cricket Stadium: శివుడి రూపంలో క్రికెట్ స్టేడియం.. డమరుకం డిజైన్ చూసి జై షా ఏమన్నారంటే?


Cricket Stadium: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరానికి మరో ప్రత్యేక గుర్తింపు తీసుకురానున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం తుది దశకు చేరుకుంది. నవంబర్ 18న ఐసీసీ అధ్యక్షుడు జై షా ఈ స్టేడియాన్ని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ తనిఖీలో పాల్గొన్నారు. మైదానం, పిచ్‌లు, ఆటగాళ్లకు కేటాయించిన గదులు, ప్రేక్షకుల గ్యాలరీలు, వీఐపీ లాంజ్ సహా స్టేడియంలోని పలు విభాగాలను పరిశీలించారు. ముఖ్యంగా శివుడి డమరుకం ఆకారంలో రూపొందించిన మీడియా సెంటర్ జై షాను ఆకట్టుకుంది. నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

నవంబర్ 30లోగా మిగిలిన పనులు పూర్తి

స్టేడియంలో ఇంకా మిగిలి ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని జై షా అధికారులకు సూచించారు. నవంబర్ 30లోగా పెండింగ్ పనులు ముగించి, డిసెంబర్ నాటికి స్టేడియాన్ని మ్యాచ్‌ల నిర్వహణకు సిద్ధం చేయాలని గడువు విధించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. పిచ్‌ల తయారీ పనులు నవంబర్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన మైదానంతో పాటు ప్రాక్టీస్ గ్రౌండ్‌లోనూ పిచ్‌లను సిద్ధం చేయనున్నారు. ఈ పనులు పూర్తయ్యాక పిచ్‌ల నాణ్యత, ఆటకు అనుకూలతను పరిశీలించి తదుపరి మ్యాచ్‌ల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.

ఎక్కువమంది చదివినది: Video: 13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం.. 281 స్ట్రైక్‌రేట్‌తో కోహ్లీ దోస్త్ రికార్డుల మోత..!

శివుడి రూపాలు కనిపించేలా స్టేడియం నిర్మాణం

ఈ స్టేడియం ప్రత్యేకత దాని నిర్మాణ శైలిలోనే ఉంది. కాశీ నగర సంస్కృతి, శివుడి ప్రతీకలు కనిపించేలా దీన్ని రూపొందించారు. డమరుకం ఆకారంలో మీడియా సెంటర్, త్రిశూలం ఆకారంలో ఫ్లడ్‌లైట్ టవర్లు, చంద్రవంకను పోలిన పైకప్పు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీలను వారణాసిలోని ఘాట్ల మెట్ల తరహాలో రూపొందించారు. స్టేడియం బయట భాగంలో బిల్వపత్రం ఆకారంలోని లోహపు పలకలను ఏర్పాటు చేశారు. ఇలా సంప్రదాయానికి ఆధునిక క్రికెట్ సౌకర్యాలను జోడించి ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు.

రూ.450 కోట్లతో 30 వేల మంది కూర్చునేలా..

వారణాసిలోని గంజారి ప్రాంతంలో 30 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఈ స్టేడియాన్ని నిర్మిస్తున్నారు. భూసేకరణ ఖర్చుతో కలిపి ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.450 కోట్లు. ఇక్కడ ఒకేసారి దాదాపు 30 వేల మంది ప్రేక్షకులు మ్యాచ్‌లను వీక్షించవచ్చు. ప్రధాన మైదానంలో తొమ్మిది పిచ్‌లు, ప్రత్యేక ప్రాక్టీస్ గ్రౌండ్‌లో ఐదు పిచ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆటగాళ్ల కోసం డ్రెస్‌ రూమ్‌లు, జిమ్‌లు, డగౌట్లు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. పార్కింగ్, మీడియా సెంటర్, కార్పొరేట్ బాక్సుల ఏర్పాట్లపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఎక్కువమంది చదివినది: IPL 2027 Retention: రిటెన్షన్ తర్వాత మారిన లెక్కలు.. పవర్ ఫుల్ టీం, వరస్ట్ టీంలు ఏవో తెలుసా..?

వర్షం వచ్చినా త్వరగా మ్యాచ్‌కు సిద్ధం

ఈ స్టేడియంలో మరో ముఖ్యమైన ప్రత్యేకత అధునాతన డ్రైనేజీ వ్యవస్థ. ఒకేసారి 100 మిల్లీమీటర్ల వర్షం కురిసినా నీటిని బయటకు పంపేలా దీన్ని రూపొందించినట్లు సమాచారం. వర్షం ఆగిన తర్వాత 20 నుంచి 25 నిమిషాల్లో మైదానాన్ని మ్యాచ్‌కు సిద్ధం చేయగలమని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్‌లో స్టేడియం ప్రారంభోత్సవం జరిగే అవకాశముంది. డిసెంబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించవచ్చని గతంలో వార్తలు వచ్చినా, అధికారికంగా తేదీ ఖరారైనట్లు సమాచారం లేదు. ప్రారంభం తర్వాత దేశవాళీ మ్యాచ్‌లతో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లకు కూడా ఈ స్టేడియం వేదిక కావాలన్నది లక్ష్యం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *