ఓటీటీల్లో ఎప్పటికప్పుడు సరికొత్త చిత్రాలు సందడి చేస్తుంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ ఒకటి. ప్రతిష్టాత్మక చిత్రోత్సవాల్లో గుర్తింపు పొందిన వైవిధ్యమైన చిత్రాలు ఓటీటీ వేదికలపైకి వచ్చినప్పుడు సినీ ప్రియుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంటుంది. ఆ కోవలోనే 29వ కోల్‌కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో భారతీయ భాషా చిత్రాల పోటీ విభాగానికి ఎంపికై అందరి దృష్టిని ఆకర్షించిన తమిళ థ్రిల్లర్ డ్రామా సాయవనం
ఇప్పుడు ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. తమిళంతో పాటు తెలుగు వెర్షన్లోనూ అందుబాటులోకి రావడమే కాదు ఓటీటీలో ట్రెండింగ్ అవుతుంది. అనిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సాయవనం కథ ఒక బలమైన మహిళా పాత్ర చుట్టూ తిరుగుతుంది. సామాజిక, మతపరమైన నియమాలను పాటిస్తూ నిజాయతీగా, హుందాగా జీవించాలని ప్రయత్నించే సీత (దేవనంద శైజిలాల్) జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు ఈ కథకు ప్రాణం.
తన చుట్టూ ఉన్న పురుషుల అసలు ఉద్దేశాలు, మోసపూరిత ధోరణులను సీత ఎలా గ్రహించింది? క్లిష్టమైన పరిస్థితుల్లో తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటూ, ధైర్యవంతురాలిగా, పోరాటయోధురాలిగా ఆమె ఎలా నిలబడిందనే అంశాన్ని దర్శకుడు థ్రిల్లర్, డ్రామా అంశాల మేళవింపుతో ఆవిష్కరించారు. ఈ చిత్రంలో సీత పాత్రలో దేవనంద శైజిలాల్ నటించగా, కీలకమైన సురుళి పాత్రను సంతోష్ దామోదరన్ పోషించారు.
సురుళి పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుంది. వీరితో పాటు సౌందరరాజ (ముత్తు), అప్పుకుట్టి (మురుగన్), జానకి జయరామన్ (అర్పుతమ్మ), వెట్రివేల్ రాజా (సింగారం), మాథ్యూ మాంప్ర (రేంజర్) ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. డమోర్ సినిమా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సంతోష్ దామోదరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విభిన్న భాషల్లో 40కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన అనిల్ కుమార్, సాయవనంతో తమిళంలో తన దర్శకత్వ ప్రస్థానాన్ని ప్రారంభించడం విశేషం.
విజు రామచంద్రన్ స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి ఎల్. రామచంద్రన్ సినిమాటోగ్రఫీ, అరుల్ సిద్ధార్థ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. కుట్టి రేవతి సాహిత్యం అందించగా, పోలి వర్గీస్ సంగీతం సమకూర్చారు. చిత్రోత్సవంలో ఎంపికైన నాటి నుంచే మంచి ప్రశంసలు అందుకున్న ఈ థ్రిల్లర్ డ్రామా, ఇప్పుడు ఓటీటీలోనూ థ్రిల్లర్, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకుల వాచ్‌లిస్ట్‌లో ప్రత్యేకంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది.




