శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన టికెట్లు, టోకెన్ల జారీ వివరాలను అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 28న శ్రీవాణి టికెట్లు, నవంబర్ 30న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
దర్శన టికెట్లు, టోకెన్ల తేదీల వివరాలు
నవంబర్ 28: ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నట్టు టీడీపీ పేర్కొంది.
నవంబర్ 30: ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానుంది.
డిసెంబర్ 1 – 5: వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం ఈ-డిప్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. డిసెంబర్ 1 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు భక్తులు పేర్లు నమోదు చేసుకోవచ్చు.
డిసెంబర్ 7: మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయింపు ఉంటుంది.
డిసెంబర్ 8: ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్లను విడుదల చేయనున్నారు.
తొలి రెండు రోజులు వీఐపీ బ్రేక్
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు రోజుల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేసింది. వీటి స్థానంలో స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్లైన్లో కేటాయించనుంది.
భక్తులు దళారులను నమ్మి మోసపోకుండా, దర్శన టికెట్లు మరియు టోకెన్లను కేవలం టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.