Headlines

Chandramohan: చంద్రమోహన్ సినిమాల్లోకి ఎలా వచ్చారో తెలుసా..?


Chandramohan: చంద్రమోహన్ సినిమాల్లోకి ఎలా వచ్చారో తెలుసా..?

బహుముఖ నటుడు చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఎంతో ఆసక్తికరం, స్ఫూర్తిదాయకం. నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వంటి దిగ్గజాలు ఒక అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు అని ప్రశంసించిన చంద్రమోహన్, 1945 మే 23న కృష్ణా జిల్లాలోని పమిడిముక్కల గ్రామంలో మల్లంపల్లి చంద్రశేఖరరావుగా జన్మించారు. అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేసిన ఆయన, కాలేజీ రోజుల్లో నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు. చదువుకు తగ్గ ఉద్యోగం సంపాదించి, ఏలూరులో అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్‌గా స్థిరపడ్డారు. 1965 సెప్టెంబర్ 26న, విజయవాడలోని తన బావ వీరభద్రరావు ఇంటికి వెళ్లిన చంద్రశేఖరరావు జీవితం ఊహించని మలుపు తిరిగింది. రంగస్థల నటుడిగా పేరుగాంచిన వీరభద్రరావుకు సినీ నటుడు ముదిగొండ లింగమూర్తి మంచి స్నేహితుడు. అదే రోజున లింగమూర్తి కూడా వారి ఇంటికి వచ్చారు. చంద్రశేఖరరావును చూసి, సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా అని లింగమూర్తి అడిగారు. అప్పుడు దర్శకరత్న బి.ఎన్. రెడ్డి రంగులరాట్నం సినిమా కోసం కొత్త నటుల అన్వేషణలో ఉన్నారని, రంగస్థల కళాకారులను చూడమని తనకు చెప్పారని లింగమూర్తి వివరించారు. సినిమాల్లోకి వెళ్లడంపై మొదట సందేహించిన చంద్రశేఖరరావు, తన ఉద్యోగం మానేసి అక్కడ స్థిరపడకపోతే ఇబ్బందులు వస్తాయని ఆందోళన చెందారు. అయితే, లింగమూర్తి నచ్చజెప్పడంతో తన ఫోటోలు ఇచ్చారు.

రెండు నెలల తర్వాత, నవంబర్ 26న, బి.ఎన్. రెడ్డి నుండి స్క్రీన్ టెస్ట్‌కు రమ్మని పిలుపు వచ్చింది. తన బావ వీరభద్రరావుతో కలిసి మద్రాస్ చేరుకున్న చంద్రశేఖరరావు, బి.ఎన్. రెడ్డి ఇచ్చిన డైలాగులను కంగారులో సరిగా చెప్పలేకపోయారు. అయితే, బి.ఎన్. రెడ్డి సహనంతో రెండు రోజులు చంద్రశేఖరరావును స్టూడియోలకు తీసుకెళ్లి, షూటింగ్‌లను చూపించి, వాతావరణానికి అలవాటు పడేలా చేశారు. నవంబర్ 29, చంద్రశేఖరరావు జీవితంలో మరపురాని రోజు. వాహిని స్టూడియోలోని ఒక ఇంటి సెట్‌లో ఆయనకు స్క్రీన్ టెస్ట్ జరిగింది. రచయితలు డి.వి. నరసరాజు, నారాయణ రెడ్డి, లింగమూర్తి, కళా దర్శకుడు ఎ.కె. శేఖర్ వంటి ప్రముఖుల సమక్షంలో, కెమెరా ముందు నిలబడి ఆత్మవిశ్వాసంతో డైలాగులు చెప్పారు. రష్ చూసి కబురు చేస్తానని బి.ఎన్. చెప్పడంతో, చంద్రశేఖరరావు నిరీక్షణ మొదలైంది. నెల రోజుల తర్వాత, రంగులరాట్నంలో ముఖ్య పాత్రకు ఎంపికైనట్లు ఉత్తరం రావడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. అయితే, మంచి ఉద్యోగాన్ని వదిలి వెళ్లాలా అనే సందేహం రావడంతో, మిత్రులతో చర్చించి ఆరు నెలల సెలవు పెట్టి మార్చి 10న తిరిగి మద్రాస్ చేరుకున్నారు. ఆ రోజు తర్వాత ఆయనకు ఏలూరుకు తిరిగి వెళ్లే అవకాశం రాలేదు. షూటింగ్ ప్రారంభానికి ముందు, బి.ఎన్. రెడ్డి చంద్రశేఖరరావును తిరుపతి తీసుకెళ్లి ఏడుకొండలవాడి ఆశీస్సులు తీసుకున్నారు. మార్చి 16న వాహిని స్టూడియోలో రంగులరాట్నం షూటింగ్ ప్రారంభమైంది. విజయాధినేతలలో ఒకరైన బి. నాగిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేయగా, నటరత్న ఎన్టీఆర్ తొలి క్లాప్ ఇచ్చారు.

ఎన్టీఆర్, చంద్రశేఖరరావును “నటన ఒక తపస్సు, బాగా కృషి చేసి పేరు తెచ్చుకోవాలి” అని ఆశీర్వదించారు. ఏప్రిల్ 7న రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. అప్పటికే బి.ఎన్. రెడ్డి చంద్రశేఖరరావు పేరును చంద్రమోహన్‌గా మార్చారు. తొలి షాట్‌లో సీనియర్ నటి అంజలీదేవి “ఏం భయపడవద్దు, జాగ్రత్తగా నటించు. మంచి పేరు తెచ్చుకుంటావ్” అని దీవించారు. “అంటే అన్నాడ్లేమ్మా అన్నయ్యే కదా వాడు మటుకు ఏం చేస్తాడు? అమ్మా వాడు ఇప్పుడు సీతమ్మ కొడుకు కాదు వనజమ్మ మొగుడు” అంటూ చంద్రమోహన్ “వాసు” పాత్రలో తన తొలి డైలాగ్‌ను చెప్పారు. బి.ఎన్. రెడ్డి ఫస్ట్ షాట్ ఓకే అనడంతో, తెలుగు సినీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *