Bengal Results: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మరీ సీఎం అయ్యేది ఎవరు..?

Bengal Results: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభంజనం.. మరీ సీఎం అయ్యేది ఎవరు..?


బెంగాల్‌లో మొత్తం 293 స్థానాలకు ఎన్నిలు జరగగా.. అక్కడ అధికారం చేపట్టాలంటే 147 స్థానాలు రావాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఇప్పటికే దాదాపు 150కి పైగా స్థానాల్లో కమలం సేన లీడ్‌లో ఉంది. పడుతూ లేస్తూ, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ముందుకు సాగిన కాషాయసేన.. ఇటుక ఇటుక పేర్చుకుంటూ.. బెంగాల్‌లో కోటను నిర్మించింది. ఇప్పుడు అధికార సింహాసనాన్ని అధిష్ఠించబోతోంది. పద్ధతిగా, పకడ్బందీగా.. పక్కా వ్యూహంతో పావులు కదిపిన బీజేపీ.. హిందుత్వ అజెండాను బెంగాల్‌లో బలంగా అమలు చేసిందని చెప్పాలి. హిందూ, ముస్లిం అనే ఫీలింగ్‌ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో సక్సెస్‌ అయ్యింది.

గత ఎన్నికల్లో బీజేపీ ఇలా

2021 ఎన్నికల్లోనే నువ్వానేనా అన్నట్టుగా తలపడిన బీజేపీ.. 65సీట్ల దూరంలో ఆగిపోయింది. హ్యాట్రిక్‌ విజయం సాధించిన మమత.. అప్పుడు కమలం ఆశలపై నీళ్లు చల్లి సీఎం పీఠాన్ని అదిష్టించింది. అయితే, ఐదేళ్లు తిరిగే సరికి.. సీన్‌ మొత్తం మారిపోయింది. 2026అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఎంసీతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా పోరాడిన బీజేపీ.. స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోతోంది.

ఎగ్జిట్ పోల్స్ తగ్గట్టుగానే ఫలితాలు

ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. అధికార పీఠాన్ని దక్కించుకునే దిశగా బెంగాల్‌లో బీజేపీ అడుగులు వేస్తోంది. పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడిగా సమీక్‌ భట్టాచార్య, ప్రతిపక్ష నాయకుడిగా సువేందు అధికారి.. కేంద్ర అధినాయకత్వం మార్గదర్శనంలో ముందుకు సాగారు. ఈ క్రమంలోనే 2026 ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు.

బెంగాల్‌లో కాబోయే సీఎం ఎవరు?

ఇక, బెంగాల్‌లో బీజేపీ అధికారం దాదాపు ఖాయమైంది కాబట్టి.. కాబోయే సీఎం ఎవరనే విషయం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేసులో ప్రస్తుత ప్రతిపక్ష నేత సువేందు అధికారి పేరు వినిపిస్తోంది. గతంలో టీఎంసీకి కీలకనాయకుడిగా పనిచేసిన ఆయన.. 2021 ఎన్నికలకు ముందు మమతకు షాకిస్తూ.. బీజేపీలో చేరారు. నందిగ్రామ్‌లో ఆమెపై విజయం సాధించారు. ఆ తర్వాత రాష్ట్రంలో బీజేపీని బలపరచడంలో కీలకంగా వ్యవహరించారు. టీఎంసీకి బలమైన ప్రత్యామ్నాయంగా ఆయన పేరు వినిపిస్తోంది.

బెంగాల్‌ సీఎం రేసులో వినిపిస్తున్న మరో పేరు దిలీప్‌ ఘోష్‌. బీజేపీకి గతంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన ఆయనకు.. క్షేత్ర స్థాయిలో బలమైన పట్టు ఉంది. పార్టీ శ్రేణుల్లో దిలీప్‌కు బలమైన మద్దతే ఉంది. రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా ఉన్న అగ్ని మిత్ర పాల్‌ కూడా సీఎం రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. ఆసన్సోల్‌ దక్షిణ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె.. పార్టీ తరపున చేపట్టిన నిరసనలు, ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

బెంగాల్‌ సీఎం రేసులో వినిపిస్తున్న మరో పేరు రూపా గంగూలీ. రాజ్యసభ మాజీ సభ్యురాలైన ఆమెకు.. ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రధానంగా పట్టణ ఓటర్లలో ఆమెకు మంచి ఆదరణ ఉంది. నిసిత్‌ ప్రమాణిక్‌ కూడా.. ముఖ్యమంత్రి రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఉత్తర బెంగాల్‌లో పార్టీని బలోపేతం చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. గతంలో కేంద్ర మంత్రిగానూ వ్యవహరించిన అనుభవం ఆయనకు ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *