Headlines

Bank Rules: రుణం తీసుకున్న వ్యక్తి ఎగ్గొడితే. హామీ సంతకం పెట్టిన వ్యక్తి చెల్లించాల్సిందేనా..? బ్యాంక్ రూల్స్ ఇవే..


తమ ఆర్ధిక అవసరాల కోసం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడం కొంతమందికి తప్పనిసరి అవుతుంది. రుణం కోసం తమ ఆస్తులు తాకట్టు పెట్టడంతో పాటు హామీదారుడి సంతకాలు పెట్టించాల్సి ఉంటుంది. హామీ సంతకం పెట్టడానికి చాలామంది ముందుకు రారు. ఎందుకంటే రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోతే ఆ బాధ్యత తమ మీద ఉంటుందనే ఉద్దేశంతో హామీ సంతకం పెట్టడానికి జంకుతుంటారు. దీంతో పాటు క్రెడిట్ స్కోర్ కూడా దెబ్బతింటుందని భయపడుతుంటారు. రుణగ్రహీత చెల్లించకపోతే హామీదారుడి సిబిల్ స్కోర్‌పై ప్రభావం ఉంటుందా..? హామీదారుడు తిరిగి చెల్లించాల్సి ఉంటుందా..? హామీ సంతకం పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

రుణం తీసుకున్న వ్యక్తి సకాలంలో తిరిగి చెల్లించకపోతే హామీదారుడిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. హామీదారుడు అంటే కేవలం ఒక కాగితంపై సంతకం చేయడమని, తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పు. రుణగ్రహీత తిరిగి చెల్లించని పక్షంలో మీపై కూడా బాధ్యత పడుతుంది. ఇలాంటి సమక్షంలో మీ క్రెడిట్ ప్రొఫైల్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు రుణాలు వచ్చే అవకాశం ఉండదు. అలాగే భారతీయ కాంట్రాక్టు చట్టంలోని సెక్షన్ 128 ప్రకారం.. బ్యాంకులు హామీదారుని నుండి కూడా డబ్బులు వసూలు చేయవచ్చు. మొత్తంతో పాటు వడ్డీ, ఇతర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హామీదారుగా మారే ముందు నిబంధనల గురించి తెలుసుకోండి. వడ్డీ, జరిమానా, ఇతర ఖర్చులు లాంటివి మీరు చెల్లించాల్సి ఉంటుందా.. లేదా అనేది తనిఖీ చేసుకోండి.

హామీదారుడు భవిష్యత్తులో హోమ్, కారు లేదా పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తుంటే.. తీవ్ర ప్రభావం చూపవచ్చు. మీ ఆదాయం, ప్రస్తుత బాధ్యతలు, క్రెడిట్ హిస్టరీ, సంభావ్య ఆర్థిక బాధ్యతల ఆధారంగా బ్యాంకు నిర్ణయం తీసుకుంటుంది. దీంతో మీరు ఎవరికైన రుణానికి హామీ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హామీ ఇచ్చే ముందు, మొత్తం రుణ మొత్తం, వడ్డీ రేటు, కాలపరిమితి, EMI గురించి మీకు పూర్తిగా అర్థమయ్యేలా తెలుసుకోవడం ముఖ్యం. అలాగే ఆ ​​హామీ పరిమిత బాధ్యత కోసమా లేక పూర్తి బాధ్యత కోసమా అనేది నిర్ధారించుకోండి. రుణగ్రహీత ఆదాయం, క్రెడిట్ చరిత్ర, ప్రస్తుత EMI భారాన్ని కూడా తనిఖీ చేయడం ముఖ్యం. పత్రాలను చదవకుండానే ఎవరైనా మిమ్మల్ని వెంటనే హామీదారుగా ఉండమని అడిగితే.. దానిని ఒక హెచ్చరిక సంకేతంగా పరిగణించండి. అవసరమైతే మీరే తిరిగి చెల్లించలేని రుణానికి హామీ ఇవ్వకుండా ఉండటమే ఉత్తమం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *