Headlines

Andhra Pradesh: కోటి మట్టి గాజులతో మహాగణపతి.. 89 అడుగుల అద్భుత రూపం.. ఎక్కడంటే..?


దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. వాడ వాడలా వినాయక పందిళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖలోనూ గణనాధులకు గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పేందుకు భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ ఎలా ఉన్నా.. గాజువాకలో కొలువుదీరే మహాగణపతి ప్రత్యేకతే వేరు. కోటి మట్టి గాజులతో శ్రీదివ్య కంకణ అలంకార మహాగణపతి రూపుదిద్దుకుంటున్నాడు. గాజువాకలో కోటి గాజులతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దివ్య కంకణ అలంకార మహా గణపతి రూపంలో వినాయకుడు కొలువు దీరనున్నాడు. ఇందుకోసం కోటి మట్టి గాజులతో మహాగణపతిని అలంకరిస్తున్నారు. పర్యావరణహితంగా 89 అడుగుల్లో రూపుదిద్దుకుంటున్న ఈ కంకణ అలంకార మహా గణపతికి.. తుది మెరుగులు దిద్దుతున్నారు. వినాయక చవితి నుంచి అక్టోబర్ 4కు 21 రోజులపాటు భక్తులకు దర్శనమిస్తారు ఈ కంకణ అలంకార మహాగణపతి.

ఫిరోజాబాద్ నుంచి మట్టి గాజులు

శ్రీ దివ్య కంకణ అలంకార మహా గణపతి కోసం కోటి మట్టి గాజులను యూపీ నుంచి తెప్పించారు. మట్టి గాజులకు ప్రసిద్ధి చెందిన ఫిరోజాబాద్ నుంచి రంగు రంగుల గాజులను తెచ్చి అలంకరిస్తున్నారు. ఆకుపచ్చ, గులాబీ, పసుపు, మెరూన్ రంగుల గాజులను వినియోగిస్తున్నారు. ఇందుకోసం కళాకారులు రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. అనకాపల్లి జిల్లాకు చెందిన సుప్రసిద్ధ కళాకారుడు ఆరిపాక కృష్ణ ఆధ్వర్యంలో 89 అడుగుల మహాగణపతిని అందంగా తీర్చిదిద్దుతున్నారు.

పర్యావరణహితంగా..

కంకణ అలంకార మహాగణపతి పర్యావరణహితంగా రూపుదిద్దుకోవడం విశేషం. మట్టి, కొబ్బరి పీచు, వెదురు బొంగులను వినియోగిస్తున్నారు. తల భాగం, రెండు హస్తాలు, రెండు పాదాలు మట్టి, కొబ్బరి పీచు సహజ సిద్ధ రంగులతో తీర్చిదిద్దుతున్నామని నిర్వాహకులు గణేష్ కుమార్ తెలిపారు. మిగిలిన భాగమంతా మట్టి గాజుకతో అలంకరిస్తున్నట్లు చెప్పారు. ఇక కిరీటం, ఆభరణాలు కోల్‌కత్తా నుంచి తెప్పించారు. కోటికిపైగా గాజులను ఉపయోగించి.. శ్రీ దివ్య కంకణ అలంకార మహా గణపతి విగ్రహం ఎత్తు 89 అడుగుల అయినా.. బేస్ నుంచి పై వరకు 109 అడుగులు పొడవు అవుతుంది. నిమజ్జనం కూడా ప్రతిష్టించిన చోటే చేస్తారు. 21 రోజుల పాటు పూజలు చేసి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం సందర్భంగా అలంకరించిన కోటి మట్టి గాజులను భక్తులకు అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు.

గతంలో ఇలా..

గతంలో ఇదే గాజువాక ప్రాంతంలోని లంకా గ్రౌండ్స్‌లో లక్ష కాటన్, పట్టు చీరలతో శ్రీ సుందర వస్త్ర మహా గణేశ పేరుతో 89 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2023లో శ్రీ అనంత పంచముఖ మహా గణపతి రూపాన్ని నెలకొల్పారు. 2022లో కైలాస విశ్వరూప మహా గణపతి రూపంలో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది కోటికి పైగా గాజులను ఉపయోగించి రూపొందించే ఈ వినాయకుడి విగ్రహం.. ఆధ్యాత్మికతను, అద్భుతమైన కళా నైపుణ్యాన్ని చాటిచెప్పనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *