ఏపీలోని చేనేతలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. చేనేతలకు పించన్లు అందించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కొంతమందికి అందిస్తుండగా.. అర్హులైనారికి కొత్త పించన్లను మంజూరు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 ఏళ్లు నిండిన వారికి అందిస్తుండగా.. గత కొద్దిరోజులుగా కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అనంతరం క్షేత్రస్థాయిలో పర్యటించి అర్హతలను పరిశీలిస్తోంది. నిజమైన అర్హులను గుర్తించి లబ్దిదారులకు పింఛన్లను మంజూరు చేయనున్నారు. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ షురూ అయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 84 వేలమంది చేనేతలు పింఛన్లు పొందుతున్నారు. ఇప్పుడు మరింతమందికి మంజూరు చేయనుండటంతో లబ్దిదారుల సంఖ్య భారీగా పెరగనుందని ప్రభుత్వం చెబుతోంది. ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోకుండా అర్హులైన చేనేతలందరికీ పించన్లను పంపిణీ చేయాలని భావిస్తోంది.
ఎన్ని దరఖాస్తులు వచ్చాయంటే..?
కొత్త పించన్ల కోసం చేనేతల నుంచి ఇప్పటివరకు 15,521 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి పరిశీలన చేపడుతున్నారు. అన్ని అర్హతలు ఉన్నాయా.. లేదా అనేది పరిశీలన చేపడుతున్నారు. అర్హుల ఎంపిక పారదర్శకంగా జరగాలని, అక్రమాలకు తావివ్వకుండా చేపట్టాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పించన్లను మంజూరు చేసేందుకు అర్హుల నుంచి డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొన్నిచోట్ల డబ్బులు వసూల చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వెళ్లంది. దీంతో చేనేతశాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వసూళ్లకు పాల్పడే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 50 ఏళ్లు నిండిన చేనేతలందరికీ పించన్లు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందకెళ్తుందని, అధికారులు చేతివాటానికి పాల్పడటం కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. చేనేతలకు ఆర్ధికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో పించన్లను అందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
నేతన్నలు మధ్యవర్తులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వవద్దని ప్రభుత్వం తెలిపింది. ఎవ్వరికీ కూడా ఒక్కరూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తు ప్రక్రియ అనేది ఉచితమని, ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన పని లేదని తెలిపింది. చేనేతలు అపోహలను నమ్మవద్దని సూచించింది. అటు వృద్దులు, వికలాంగులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల పించన్ల కోసం కూడా ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తులను పరిశీలించిన అనంతరం లబ్దిదారుల జాబితాను సిద్దం చేయనుంది. ఈ జాబితాను సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. అనంతరం ప్రతీ నెలా వీరికి పించన్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి కొత్త పింఛన్లను మంజూరు చేస్తున్నారు. దీంతో అర్హుల వీటి కోసం ఎదురుచూస్తున్నారు.