ప్రకాశం జిల్లా అద్దంకిలో ఒక అరుదైన, అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. చీకటి చీల్చుకుంటూ గర్భగుడిలోకి వచ్చిన లేలేత సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్‌పై పడి బంగారు కాంతులతో మెరిసిపోయాయి. పట్టణంలోని వెయ్యి స్తంభాల గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ గంగా వింధ్యవాసిని సమేత నగేశ్వర స్వామివారి ఆలయం ఈ అద్భుత దృశ్యానికి వేదికైంది. గర్భగుడిలోని పరమశివుడిని ఆదిత్యుడు ప్రత్యక్షంగా పూజించాడు.
నగేశ్వరుడి లింగాకృతిపై భానుడి కిరణాలు పడిన ఈ దృశ్యం చూస్తే.. సూర్యుడే మొదటి పూజారిగా మారినట్లుగా సాక్షాత్కరించింది. అయితే, ఇది సైన్సా? దైవ రహస్యమా? లేక ప్రాచీన శిల్పకళా వైభవమా? అనే చర్చకు దారితీసింది. నిజానికి దేవాలయాల మూలవిరాట్‌పై సూర్యకిరణాలు నేరుగా పడేలా నిర్మించడం వెనుక ప్రాచీన భారతదేశపు ఖగోళ శాస్త్రం, వాస్తుశిల్ప కళా నైపుణ్యం, అలాగే ఆధ్యాత్మిక విజ్ఞానం దాగి ఉన్నాయి.
ఎలాంటి ఆధునిక సాంకేతిక పరికరాలు లేని ఆ కాలంలోనే మన పూర్వీకులు సూర్యుని గమనాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఈ అద్భుతాలను సృష్టించారు. ఇది కేవలం దైవిక చమత్కారం మాత్రమే కాదు.. నాడు మన శిల్పులు సాధించిన ఖగోళ, గణిత, ఇంజనీరింగ్ అద్భుతాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.