Headlines

Andhra: చిన్నప్పుడు ఆకలి తీరడం కోసం అమ్మతో కలిసి భిక్షాటన.. ఇప్పుడు ASP

Andhra: చిన్నప్పుడు ఆకలి తీరడం కోసం అమ్మతో కలిసి భిక్షాటన.. ఇప్పుడు ASP


ఆంధ్రప్రదేశ్‌ పోలీస్ విభాగంలో పని చేస్తున్న అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఆమిటి హనుమంతు ప్రస్థానం పేదరికం, వివక్ష, నిరంతర కృషి, విజయం కలగలిసిన అద్భుత గాథ. అన్నమయ్య జిల్లా కలికిరి మండలం తెల్లగుట్టపల్లికి చెందిన హనుమంతు బాల్యం అత్యంత కష్టాలతో గడిచింది. తల్లిదండ్రులు రామయ్య, కృష్ణమ్మలకు నలుగురు సంతానంలో హనుమంతు ఒకరు. కుటుంబ పోషణ కోసం చిన్నతనంలోనే ఆయన భిక్షాటన చేయాల్సి వచ్చింది. ఇంటింటికి వెళ్లి అన్నం అడిగేవారు, కొన్నిసార్లు తన తల్లితో కలిసి పాఠశాలల వద్దకు భోజనం కోసం వెళ్లేవారు. ఒకానొక సందర్భంలో, పాఠశాలలో చేరదామని వెళ్లినప్పుడు, భోజనం అడగడానికి వచ్చారని పొరబడి అధికారులు బయటకు పంపించారు. ఈ సంఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. తాను రెగ్యులర్‌గా భోజనం కోసం తల్లితో కలిసి భిక్షాటన కోసం వెళ్లేవాడినని, అయితే బడిలో చేరడానికి వెళ్లినప్పుడు యాచకుడిగా భావించి తరిమేశారని హనుమంతు గుర్తు చేసుకున్నారు. అప్పటికే చదువుపై ఉన్న ఆసక్తిని గమనించిన ఆయన తల్లి కృష్ణమ్మ, పలక కొనిచ్చి మళ్లీ బడికి పంపించారు. పాఠశాలలో కూడా వివక్షను ఎదుర్కొన్నారు. మాసిన బట్టలతో వెళ్లినప్పుడు కుక్కలు వెంటపడటం, క్లాస్‌మేట్స్ పక్కన కూర్చోబెట్టుకోవడానికి నిరాకరించడం, టీచర్లు లేనప్పుడు వెనక్కి వెళ్లి కూర్చోమని బెదిరించడం వంటివి జరిగాయి.

ఒకసారి నీళ్లు అడిగినప్పుడు, ఇంట్లో గ్లాసులు ఉన్నా, “నీకు గ్లాస్ ఇవ్వకూడదు” అంటూ కొబ్బరి చిప్పలో నీళ్లు ఇవ్వడం ఆయన మనసును గాయపరిచింది. ఈ వివక్షలన్నీ ఆయనలో పట్టుదలను, ఏదో సాధించాలనే సంకల్పాన్ని పెంచాయి. చదువుకోవడానికి ఆర్థికంగా సహకరించేందుకు హనుమంతు చిన్నతనంలోనే పని చేయడం ప్రారంభించారు. ఉదయం 3 గంటలకు లేచి అడవికి వెళ్లి కట్టెలు తెచ్చి, ఇంటికి వచ్చి భోజనం చేసి, ఒక చేతిలో పుస్తకాలు, మరో చేతిలో కట్టెల మోపుతో బడికి వెళ్లేవారు. బడికి వెళ్తూనే కట్టెలు అమ్మి డబ్బు సంపాదించేవారు. గ్రామస్థులు ఆయన చదువు పట్ల ఉన్న ఆసక్తిని చూసి ఆశ్చర్యపోయేవారు. కొన్నిసార్లు పాఠశాలకు వెళ్లకుండా కూలి పనులు, పెళ్లిళ్లు, కర్మకాండలలో పనులు చేసేవారు. పనులు ముగిసిన తర్వాత ఇచ్చే భోజనం కోసం ఎదురుచూసేవారు. తన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి పాత పుస్తకాలు కొనుక్కొని, సీనియర్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారికి పనులు చేసి వారి పుస్తకాలు అడిగి తెచ్చుకుని చదువుకునేవారు. మదనపల్లెలో డిగ్రీ పూర్తి చేసిన హనుమంతు, 1991లో హైదరాబాద్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్ ఎస్ఐగా ఎంపికయ్యారు. పోలీస్ ఉద్యోగం కోసం కూడా తీవ్రంగా కష్టపడ్డారు. హైదరాబాద్‌లో బస్ స్టాండ్‌లోనే నిద్రపోయి, అక్కడే ఉండి ఉద్యోగం సంపాదించారు. గ్రేహౌండ్స్, టీటీడీ విజిలెన్స్, వివిధ జిల్లాల ఆర్మ్‌డ్ రిజర్వ్‌లలో పనిచేస్తూ ప్రమోషన్స్ పొందుతూ వచ్చారు. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, వివక్షలు తనను ఉన్నత స్థాయికి చేర్చాయని ఆయన చెబుతారు. ఏఎస్పీగా ఎదిగిన ఆమిటి హనుమంతు నేడు అనేకమందికి ఆదర్శప్రాయులుగా నిలిచారు.

మనం ఎలాంటి స్థితిలో ఉన్న కూడా ఒక్క విద్యను నమ్ముకుంటే చాలు అది మనల్ని ఏ స్థాయికి తీసుకువెళ్తుందో హనుమంతు నిరూపించారు. కుటుంబంలో ఒకరు గొప్పగా చదవినా చాలు.. ఆ ఫ్యామిలీ ఎంతో వృద్ధిలోకి వస్తుంది. అందుకే చదువును నిర్లక్ష్యం చేయకండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *