కావలసిన పదార్థాలు: వేరుశనగ గింజలు – 1 చిన్న కప్పు, జీలకర్ర – అర స్పూన్, మెంతులు – అర స్పూన్, చింతపండు – నిమ్మపండు సైజు, సన్నగా తరిగిన 1 మీడియం సైజు ఉల్లిపాయ, నిలువుగా చీల్చిన పచ్చిమిరపకాయలు – 2 నుండి 3, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తుంచిన ఎండుమిరపకాయలు – 2, ఆవాలు – అర టీస్పూన్, పసుపు – అర స్పూన్, కారం పొడి – అర టీస్పూన్, తాజా కరివేపాకు – 1 రెమ్మ, తాజా కొత్తిమీర తరుగు – గుప్పెడు, సాల్ట్ – రుచికి సరిపడా, వంట నూనె – 3 స్పూన్లు, నీళ్లు – రసానికి సరిపడా.
తయారీ విధానం: ఒక గిన్నెలో నిమ్మపండు సైజు చింతపండు తీసుకుని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి లో ఫ్లేమ్‌లో అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు వేసి రంగు మారే వరకు దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో 2 గుప్పెళ్ల పల్లీలు వేసి లో ఫ్లేమ్‌పై మాడిపోకుండా నిదానంగా వేయించాలి. వేగిన పల్లీలు చల్లారిన తర్వాత పొట్టు తీసి.. మిక్సీ జార్లో వేయించిన జీలకర్ర, మెంతులతో కలిపి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
నబెట్టిన చింతపండును బాగా పిసికి రసం తీసి స్ట్రైనర్‌తో వడకట్టుకోవాలి. ఈ చింతపండు పులుసులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లి మసాలా పొడిని మరీ ఎక్కువ కాకుండా తగినంత వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. రసానికి సరిపడా జారుడు కన్సిస్టెన్సీ వచ్చేలా నీళ్లు పోసి సిద్ధంగా ఉంచుకోవాలి.
స్టవ్‌పై రసం గిన్నె పెట్టి 3 స్పూన్ల నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇందులో తుంచిన 2 ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చీల్చిన పచ్చిమిర్చి మరియు చిటికెడు ఉప్పు వేసి ఉల్లిపాయలు రంగు మారే వరకు వేపాలి. ఇందులో అర స్పూన్ పసుపు వేసి ఒక్క నిమిషం వేయించాలి.
వేగిన తాలింపులోకి సిద్ధం చేసి పెట్టుకున్న పల్లి-చింతపండు నీళ్లను పోయాలి. రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం పొడి వేసి కలపాలి (పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోవాలి). మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి రసాన్ని ఎక్కువసేపు మరిగించకుండా కేవలం రెండు పొంగులు రాగానే.. పైనుంచి తాజా కొత్తిమీర తరుగు చల్లి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, నోరూరించే రాయలసీమ సాంప్రదాయ 'పల్లి రసం' సిద్ధం! వేడివేడి అన్నంలో ఈ కమ్మటి పల్లీల చారు పోసుకుని.. పక్కన అప్పడం, వడియాలు లేదా ఆమ్లెట్ నంజుకుని తింటుంటే కమ్మటి పల్లీల రుచి, చింతపండు పులుపుతో నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు!




