Headlines

Telangana: అయ్యో పాపం అని సాయం చేయబోతే.. ఈ వెదవలు ఏం చేశారో వీడియోలో చూడండి..


అయ్యో పాపం అని మానవత్వంతో సాయం చేయబోయిన ఓ వృద్ధుడికి చేదు అనుభవం ఎదురైంది. బైక్ పైనుంచి కింద పడిపోతున్నట్లు నటించిన ఇద్దరు యువకులు, ఆ వృద్ధుడి జేబులోంచి ఏకంగా రూ.1.50 లక్షల విలువైన సెల్‌ఫోన్‌ను క్షణాల్లో కొట్టేసి పరారయ్యారు. ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఖమ్మం నగరానికి చెందిన రమణ అనే వ్యక్తి గట్టయ్య సెంటర్‌లోని ఓ కిరాణా షాపు వద్ద సరుకులు కొనుగోలు చేసేందుకు వెళ్లారు. అదే సమయంలో కస్టమర్లలా షాపు వద్దకు వచ్చిన ఇద్దరు యువకులు, వృద్ధుడిని గమనించి అతని వద్ద ఖరీదైన ఫోన్ ఉన్నట్లు పసిగట్టారు. సరుకులు తీసుకున్న రమణ షాపు బయటకు రాగానే, ఆ ఇద్దరు కేటుగాళ్లు తమ పథకాన్ని అమలు చేశారు.

పడిపోతున్నట్లు నటించి చేతివాటం

బైక్‌పై వెళ్తూ అకస్మాత్తుగా కింద పడిపోతున్నట్లు ఒక యువకుడు నటించాడు. అది గమనించిన రమణ.. పాపం దెబ్బలు తగులుతాయేమోనన్న ఉద్దేశంతో వెంటనే అక్కడికి వెళ్లి ఆ యువకుడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఇదే అదునుగా భావించిన ఆ కేటుగాళ్లు, వృద్ధుడి దృష్టిని మళ్లించి అతని జేబులో ఉన్న సెల్‌ఫోన్‌ను చాకచక్యంగా లాగేసుకున్నారు. ఆ వెంటనే ఇద్దరూ కలిసి బైక్‌పై అక్కడి నుంచి మెరుపువేగంతో పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత జేబు చూసుకున్న రమణ, ఫోన్ కనిపించకపోవడంతో షాక్‌కు గురయ్యారు. చోరీకి గురైన ఫోన్ విలువ సుమారు రూ.1.50 లక్షల వరకు ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో బాధితుడు రమణ ఫిర్యాదు చేశారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి.

ముఠాలపై నిఘా పెట్టాలని స్థానికుల విజ్ఞప్తి

ఖమ్మం జిల్లాలో ఇటీవల ఇలాంటి తరహా చోరీలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ముఠాగా ఏర్పడి రద్దీ ప్రాంతాలను ఎంచుకొని, పట్టపగలే బైక్ పైనుంచి పడుతున్నట్లు నటిస్తూ ప్రజల దృష్టి మళ్లించి ఫోన్లు దోచుకుంటున్నారని చెబుతున్నారు. పోలీసులు ఇలాంటి దొంగల ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టి, సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

వీడియో చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *