డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఇక ప్రక్రియ కఠినతరం కానుంది. ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉండేది. ముందుగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్ష రాసి, ఆ తర్వాత ఆరు నెలల్లోపు డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. డ్రైవింగ్ టెస్ట్‌లో అర్హత సాధిస్తే 10 రోజుల్లో డ్రైవింగ్ లైసెన్స్ పోస్ట్ ద్వారా రవాణాశాఖ ఇంటికి పంపించేంది. కానీ ఇక నుంచి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను కఠినతరం చేసింది. ఈ మేరకు కేంద్ర మోటారు వాహన నిబంధనలకు ప్రధాన సవరణల ముసాయిదాను కేంద్రం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా లెర్నింగ్ లైసెన్స్ పరీక్షను మరింత కఠినతరం చేస్తున్నారు. ఈ కొత్త రూల్స్ ఏంటనేది చూద్దాం.
లెర్నర్ లైసెన్స్ పరీక్ష మార్కులు పెంపు
గతంలో లెర్నర్ లైసెన్స్ పరీక్షలో ఉత్తీర్ణత మార్కులు 60 శాతంగా ఉండేది. కానీ ఇప్పుడు కనీసం 75 శాతం మార్కులు అవసరమయ్యేలా కొత్త నిబంధన తీసుకొస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు దరఖాస్తుదారులకు రహదారి చిహ్నాలు, ట్రాఫిక్ నియమాలు, సురక్షిత డ్రైవింగ్‌పై పూర్తి అవగాహన ఉండేలా చూసేందుకు ఉత్తీర్ణత మార్కులను పెంచారు. సురక్షిత డ్రైవింగ్‌పై ఆన్లైన్ ట్యుటోరియల్ కనీసం 30 నిమిషాల నిడివి ఉండేలా మార్పులు చేయనున్నారు. ఇది పూర్తి చేసేందుకు గతంలో నిర్ణయించిన ఏడు రోజుల సమయాన్ని 15 రోజులకు పెంచనున్నారు. ట్యుటోరియల్ పూర్తి చేసిన తర్వాత నిర్దేశించిన కాలపరిమితిలోపు లెర్నింగ్ లైసెన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది.
ఈ విషయంలో ఊరట
అయితే డ్రైవింగ్ లైసెన్స్ పొందినవారు తమ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకునే ప్రక్రియను మరింత సులభతరం చేశారు. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ, అడ్రస్ వంటివి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. గతంలో ఇందుకోసం రూ.200 వరకు ఫీజులు వసూలు చేసేవారు. ఇప్పుడు వాటిని పూర్తిగా మాఫీ చేశారు. వ్యక్తిగత వివరాల్లో మార్పుల కోసం రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు 15 రోజుల్లోపు నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ దరఖాస్తు రిజెక్ట్ చేస్తే సరైన కారణాలు పొందుపర్చాలి. అలాగే అడ్రస్‌లో మార్పులకు సంబంధించిన దరఖాస్తులను 30 రోజుల్లోపు నిర్ణయం తీసుకోకపోతే ఆటోమేటిక్‌గా ఆమోదం పొందినట్లు పరిగణిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో మరింత పారదర్శకత తీసుకురావడం కోసం కేంద్రం ఈ కొత్త నిర్ణయాలు అమలు చేయాలని చూస్తోంది. దేశంలో రోడ్డు ప్రమాాదాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీనికి కారణం నిబంధనలపై అవగామణ లేకపోవడమేనని కేంద్రం చెబుతోంది. దీంతో రోడ్డు ప్రమాదాలను కట్టడి చేసేందుకు డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను కఠినం చేయనుంది.