Headlines

సిటీలో మీరు తినే చేపలు సూపర్ ఫ్రెష్ అనుకుంటున్నారా..? అసలు విషయం తెలిస్తే షాకే..


మనం ఎంతో ఇష్టంగా తినే చేపలు నిజంగానే తాజాగా ఉన్నాయా? లేక రోజుల తరబడి నిల్వ ఉంచి, కుళ్లిపోయిన చేపలను మనకు అంటగడుతున్నారా? హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసిన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నగరంలోని ప్రధాన చేపల విక్రయ కేంద్రాలైన రాంనగర్, బేగంబజార్ మార్కెట్లలో కుళ్లిపోయిన చేపలను తాజాగా ఉన్నట్లుగా నమ్మించి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. TG SAFE టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.

కుళ్లిన చేపలే తాజావంటూ విక్రయాలు!

రాంనగర్, బేగంబజార్ మార్కెట్లలోని పలు దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రోజుల తరబడి నిల్వ ఉంచిన, కుళ్లిపోయిన చేపలను తాజాగా ఉన్నట్లుగా చూపిస్తూ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వాటిని అక్కడికక్కడే స్వాధీనం చేసుకున్నారు. చేపలు ఎక్కువ రోజులు పాడవకుండా ఉండేందుకు కొందరు వ్యాపారులు ప్రజారోగ్యానికి హాని కలిగించే రసాయనాలను ఉపయోగిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైందని అధికారులు తెలిపారు.

అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ

చేపల విక్రయ కేంద్రాల్లో కనీస పరిశుభ్రత ప్రమాణాలు కూడా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. అపరిశుభ్రమైన వాతావరణంలో చేపలను నిల్వ ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల విక్రయానికి అవసరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా దుకాణాల వద్ద సాధారణ ట్రేడ్ లైసెన్సులు మాత్రమే ఉండగా, ఆహార విక్రయాలకు తప్పనిసరిగా ఉండాల్సిన FSSAI ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేదని గుర్తించారు.

నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు

నాణ్యతా ప్రమాణాలు పాటించని పలు దుకాణాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రతి చేపల వ్యాపారి తప్పనిసరిగా FSSAI లైసెన్స్ పొందాలని ఆదేశించారు. ప్రజారోగ్యానికి హాని కలిగించేలా కుళ్లిన చేపలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

చేపలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన సూచిస్తోంది. తాజాదనం, పరిశుభ్రతపై అనుమానం ఉంటే అలాంటి చేపలను కొనుగోలు చేయకపోవడమే మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *