తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కారులో ఒంటరిగా ప్రయాణించే వాహనదారులకు ఇకపై జరిమానాలు విధించనున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కలకలం రేపింది. ఈ వైరల్ వార్తలపై తెలంగాణ పోలీస్ శాఖ, రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం స్పందించి పూర్తి స్పష్టత ఇచ్చాయి. కారులో డ్రైవర్ ఒక్కరే ప్రయాణిస్తే ట్రాఫిక్ చలాన్ విధిస్తారని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొస్తోందంటూ పలు సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని పోలీసులు తేల్చిచెప్పారు. ఒంటరిగా కారు నడిపేవారిపై జరిమానాలు విధించే ఆలోచన కానీ, అలాంటి ప్రతిపాదన కానీ ప్రభుత్వ పరిశీలనలో అసలు లేదని స్పష్టం చేశారు.
అసలు గందరగోళం ఎక్కడ మొదలైంది?
ఇటీవల హైదరాబాద్ ఐటీ కారిడార్ సహా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు పోలీసులు వాహనదారులకు కొన్ని విజ్ఞప్తులు చేశారు. ఒకే మార్గంలో, ఒకే ఆఫీసులకు వెళ్లేవారు వేర్వేరు కార్లలో కాకుండా కార్‌పూలింగ్ ఎంచుకోవాలని, సాధ్యమైనంత వరకు ప్రజా రవాణాను వినియోగించుకోవాలని సూచించారు. ఈ సూచనలను కొందరు తప్పుగా అర్థం చేసుకుని, కార్‌పూలింగ్ చేయకపోతే ఫైన్ వేస్తారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. దీనిపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ రెడ్డి, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ జోయెల్ డేవిస్ సైతం స్పందిస్తూ, ఎలాంటి జరిమానాల ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ ఫ్యాక్ట్‌చెక్ విభాగం హెచ్చరిక
ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ఎక్స్ వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. కార్‌పూలింగ్‌పై పోలీసులు చేసిన అవగాహన సూచనలను జరిమానాలతో ముడిపెడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సోషల్ మీడియా ఖాతాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు.
వాహనదారులకు పోలీసుల సూచన
నగర రహదారులపై వాహనాల ఒత్తిడిని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని పోలీసులు వెల్లడించారు. అందుకే స్వచ్ఛందంగా కార్‌పూలింగ్, మెట్రో, బస్సు వంటి ప్రజా రవాణా వ్యవస్థలను ఉపయోగించుకోవాలని కోరారే తప్ప, ఎవరిపైనా బలవంతపు నిబంధనలు లేదా జరిమానాలు విధించడం లేదని స్పష్టం చేశారు. కాబట్టి వాహనదారులు సోషల్ మీడియా వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ప్రజలకు విజ్ఞప్తి:
కారులో ఒంటరిగా ప్రయాణిస్తే జరిమానా అంటూ వస్తున్న వార్తలు అవాస్తవం: తెలంగాణ పోలీసులు
కారులో ఒంటరిగా ప్రయాణించే వారిపై జరిమానా విధించేలా ట్రాఫిక్ నిబంధనలను తీసుకువచ్చే ఆలోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని పోలీసులు స్పష్టం చేశారు.
➤ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు కార్లలో ఒంటరిగా ప్రయాణించకుండా, ఇతరులతో కలిసి కార్‌పూలింగ్ చేయాలని మాత్రమే ప్రయాణికులకు సూచించామని పోలీసులు తెలిపారు.
➤ వాహనాల సంఖ్యను తగ్గించి, రోడ్లపై ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఉమ్మడి ప్రయాణాన్ని ప్రోత్సహించడమే ఈ విజ్ఞప్తి ఉద్దేశమని పేర్కొన్నారు. దీనికి జరిమానాలు లేదా శిక్షలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
➤ కారులో ఒంటరిగా ప్రయాణించే వారిపై జరిమానాలు విధించే ప్రతిపాదన కూడా ఏదీ లేదని తెలియజేసారు.
నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకోవాలని, కార్‌పూలింగ్ వంటి ప్రయాణ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు. అయితే, కారులో ఒంటరిగా ప్రయాణించినందుకు ఎలాంటి జరిమానా లేదా శిక్ష విధించే ప్రణాళిక లేదని స్పష్టం చేశారు.
— FactCheck_Telangana (@FactCheck_TG) November 26, 2026