Headlines

Hyderabad: నాంపల్లి మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రైల్వే స్టేషన్‌కు నేరుగా వెళ్లేలా కొత్త బ్రిడ్జి!


Nampally Railway Station: హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులకు త్వరలో మరింత సౌకర్యం అందుబాటులోకి రానుంది. నాంపల్లి మెట్రో స్టేషన్ నుంచి నేరుగా రైల్వే స్టేషన్‌కు చేరుకునేలా ప్రత్యేక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. దాదాపు పదేళ్లుగా ప్రతిపాదన దశలో ఉన్న ఈ ప్రాజెక్టు.. దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన నాంపల్లి స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా కార్యరూపం దాల్చుతోంది. నాంపల్లి మెట్రో స్టేషన్, హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ మధ్య 220 మీటర్ల పొడవుతో ఈ వంతెన నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.21 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం మెట్రో నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే రద్దీగా ఉండే రోడ్ల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. కొత్త వంతెన అందుబాటులోకి వస్తే రోడ్డు మీదకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ప్రయాణికులు ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కు చేరుకోవచ్చు.

ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి తొమ్మిది మీటర్ల వెడల్పుతో నిర్మించనున్నారు. ఇందులో ఎక్కువ భాగం ప్రయాణికులు సులభంగా ముందుకు వెళ్లేందుకు ట్రావెలేటర్ సదుపాయం కల్పిస్తారు. వంతెనలో వంపులు ఉండే ప్రాంతాల్లో మాత్రం ఈ సౌకర్యం ఉండదు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్ల ప్రయాణికులతో పాటు ఎంఎంటీఎస్‌ ప్రయాణికులకూ ఇది ఉపయోగపడనుంది. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఏ. శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వంతెనకు మొత్తం 20 పునాదులు నిర్మించాల్సి ఉండగా, ఇప్పటికే 10 పూర్తయ్యాయి. మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. అమృత్ స్టేషన్ పథకంలో భాగంగా నాంపల్లి రైల్వే స్టేషన్‌ను రూ.327 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. 1907లో ప్రారంభమైన ఈ స్టేషన్‌కు వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. ప్రస్తుతం రోజుకు సుమారు 60 రైళ్లు, 25 వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రాకపోకల మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేయనున్నారు. బేస్‌మెంట్‌లో పార్కింగ్ సదుపాయం కల్పిస్తారు. సుమారు 13,550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

రెన్నోవేషన్ పూర్తయిన తర్వాత నాంపల్లి స్టేషన్‌లో ప్రయాణికులకు అనేక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఏసీ సౌకర్యంతో కూడిన విశాలమైన కాన్‌కోర్స్, 16 లిఫ్టులు, 8 ఎస్కలేటర్లు, దివ్యాంగులకు అనుకూలమైన ఏర్పాట్లు, ఆధునిక అగ్నిమాపక వ్యవస్థ, ఫుడ్ కోర్టులు, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ కెమెరాల నిఘా, సోలార్ విద్యుత్ సదుపాయం, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, రోజుకు 500 కిలోలీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్ అందుబాటులోకి రానున్నాయి.

స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా ప్లాట్‌ఫామ్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. అయితే స్థలం పరిమితంగా ఉండటంతో ప్లాట్‌ఫామ్‌లను మరింత విస్తరించడం సాధ్యం కావడం లేదు. అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి రైళ్ల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌లు 1, 2, 3లను ప్రధానంగా ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లతో పాటు 24 కోచ్‌ల కంటే తక్కువ బోగీలు ఉన్న రైళ్ల కోసం ఉపయోగించనున్నారు. ప్లాట్‌ఫామ్‌లు 4, 5, 6లను గోదావరి ఎక్స్‌ప్రెస్, తెలంగాణ ఎక్స్‌ప్రెస్ వంటి దూరప్రాంత రైళ్లకు కేటాయించనున్నారు.

మరోవైపు, నాంపల్లి రైల్వే స్టేషన్ పాత ప్రధాన భవనాన్ని కూల్చివేయడంపై వారసత్వ కట్టడాల పరిరక్షణను కోరుకునే వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ భవనం అధికారికంగా వారసత్వ కట్టడాల జాబితాలో లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. నగరం మధ్యలో ఉన్న స్టేషన్‌కు చుట్టూ విస్తరణకు అవకాశం లేకపోవడంతో, ఆధునికీకరణ పనుల కోసం పాత భవనాలను తొలగించాల్సి వచ్చిందని వివరిస్తున్నారు. ఇదే సమయంలో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కాచిగూడ రైల్వే స్టేషన్‌ను మాత్రం దాని చారిత్రక ప్రత్యేకతకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా ఆధునికీకరిస్తున్నారు.

మొత్తంగా నాంపల్లి స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తయితే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా మెట్రో నుంచి రైల్వే స్టేషన్‌కు నేరుగా వెళ్లే ఫుట్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రావడం ప్రయాణికులకు పెద్ద ఊరట కానుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *