Headlines

థాంక్యూ సీఎం సార్.. ఇకపై మగాళ్లకు కూడా పితృత్వ సెలవులు !!


తమిళనాడు రాజకీయాల్లో చారిత్రక విజయం సాధించి ద్రవిడ కోటపై జెండా పాతారు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్. కాగా అధికారం చేపట్టిన నాటి నుంచి పాలనలోనూ తన మార్క్ విలక్షణతను చాటుకుంటున్నారు.  మే 10న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఆయన చూపిస్తున్న క్రమశిక్షణ, సమయపాలన తమిళనాడు అధికార వర్గాలనే కాదు.. దేశవ్యాప్త రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా రాష్ట్రంలోని లక్షలాది మంది పురుష ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం విజయ్ భారీ శుభవార్త అందించారు.

15 రోజుల పితృత్వ సెలవులు..

తమిళనాడు చరిత్రలోనే తొలిసారిగా పురుష ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పాటు పితృత్వ సెలవులు (Paternity Leave) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వివాహితులైన పురుష ఉద్యోగులకు బిడ్డ జన్మించినప్పుడు ఈ సెలవులు వర్తిస్తాయి. ఈ 15 రోజుల కాలాన్ని పూర్తి వేతనంతో కూడిన సెలవులుగా పరిగణిస్తారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, లక్షలాది మంది ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నూతన కుటుంబాలకు ఇది ఎంతో ఊరటనిస్తుందని కొనియాడుతున్నారు.

సెలవుల వినియోగంలో నిబంధనలు..

ఎప్పుడు తీసుకోవచ్చు: అర్హత కలిగిన ఉద్యోగులు తమ భార్య ప్రసవ తేదీకి (Delivery Date) 15 రోజుల ముందు నుంచి, లేదా బిడ్డ పుట్టిన తర్వాత మొదటి ఆరు నెలల (6 Months) లోపు ఎప్పుడైనా ఈ సెలవులను వినియోగించుకోవచ్చు.

పరిమితి: ఈ పథకం మొదటి ఇద్దరు జీవించి ఉన్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది.

లక్ష్యం: ప్రసవ సమయంలో భార్యకు శారీరకంగా, మానసికంగా అండగా నిలబడటం, నవజాత శిశువు ఆలనాపాలనా చూసుకోవడంలో తండ్రి పాత్రను ప్రోత్సహించడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశం.

మహిళా ఉద్యోగులకు ఇప్పటికే ఏడాది సెలవులు..

దేశవ్యాప్తంగా ‘మాతృత్వ ప్రయోజన చట్టం, 1961’ ప్రకారం మహిళా ఉద్యోగులకు 26 వారాల వేతనంతో కూడిన సెలవులు అందుబాటులో ఉన్నాయి. అయితే తమిళనాడులో మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా 365 రోజుల పాటు (ఒక పూర్తి సంవత్సరం) మాతృత్వ సెలవులను అక్కడి ప్రభుత్వం అందిస్తోంది. ఇప్పుడు పురుషులకు కూడా పితృత్వ సెలవులు ఇవ్వడం ద్వారా, బిడ్డ పెంపకంలో తల్లితో పాటు తండ్రి బాధ్యత కూడా సమానమేనని సీఎం విజయ్ ప్రభుత్వం చాటిచెప్పినట్లయింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 15 రోజుల పితృత్వ సెలవుల విధానం అమల్లో ఉంది. రాష్ట్రాల విషయానికి వస్తే.. కేరళ, సిక్కిం, హరియాణా, రాజస్థాన్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే తమ పురుష ఉద్యోగులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తాజా నిర్ణయంతో ఆ ప్రగతిశీల రాష్ట్రాల సరసన తమిళనాడు కూడా చేరింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *