Headlines

ఓలా స్కూటర్ ప్రమాదం.. యజమానికి రూ. 1.98 లక్షల పరిహారం!


మహారాష్ట్రలోని రాయగఢ్‌కు చెందిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానికి కన్స్యూమర్ కమిషన్ రూ. 1.98 లక్షల పరిహారం మంజూరు చేసింది. కర్జత్ వాసి కొనుగోలు చేసిన ఓలా S1 X ప్లస్ స్కూటర్‌లో బ్యాటరీ, ఎలక్ట్రానిక్ సమస్యలు తలెత్తి, ఆటోమెటిక్‌గా స్పోర్ట్స్ మోడ్‌లోకి మారడంతో ప్రమాదం జరిగింది. సర్వీస్ సెంటర్ల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కరించకపోవడమే కాకుండా, లోపాలతోనే వాహనం నడపాలని సూచించడాన్ని కమిషన్ సేవలో లోపంగా పేర్కొంది.

ఏం జరిగింది?

కర్జత్ నివాసి అయిన ఫిర్యాదుదారుడు 2023 సెప్టెంబర్ 6న రూ. 1,28,000 చెల్లించి ఓలా S1 X ప్లస్ స్కూటర్‌ను బుక్ చేశారు. 30 రోజుల్లో డెలివరీ ఇస్తామని చెప్పినా, రెండు నెలలు ఆలస్యంగా డిసెంబర్ 22, 2023న వాహనాన్ని అప్పగించారు. డెలివరీ అయిన కొద్ది రోజులకే స్కూటర్ అకస్మాత్తుగా ఆగిపోవడం, ఎలక్ట్రానిక్ వైఫల్యాలు, బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలు మొదలయ్యాయి. ఆ సమస్యలు వాటంతట అవే సర్దుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు.

సమస్యలు.. ప్రమాదాలు

అయితే సమస్యలు తగ్గకపోగా రెండు ప్రమాదాలకు దారితీశాయి. థానే, కర్జత్ సర్వీస్ సెంటర్లకు పదేపదే వెళ్లినా లోపాలు సరిదిద్దబడలేదు. ఒక ప్రమాదం తర్వాత స్కూటర్ దాదాపు రెండు నెలల పాటు థానే సర్వీస్ సెంటర్‌లోనే ఉండి, ఏప్రిల్‌లో మళ్లీ బ్యాటరీ సమస్యలతోనే తిరిగి వచ్చింది. సర్వీస్ సెంటర్లలో రద్దీ కారణంగా లోపాలున్న స్కూటర్‌నే నడుపుతూ ఉండమని సిబ్బంది సూచించారని కమిషన్ దృష్టికి వచ్చింది. 2024 అక్టోబర్‌లో కర్జత్ సర్వీస్ స్టేషన్‌కు వెళ్తుండగా స్కూటర్ మోడ్ ఎకో నుంచి ఆటోమెటిక్‌గా స్పోర్ట్స్ మోడ్‌లోకి మారి వేగంగా దూసుకుపోయి మరో వాహనాన్ని ఢీకొట్టింది.

ఇవి కూడా చదవండి



కమిషన్ ఆదేశాలు

డిసెంబర్ 2024లో పంపిన లీగల్ నోటీసుకు, ఆపై విచారణకు ఓలా ఎలక్ట్రిక్ స్పందించకపోవడంతో 2026 జూలైలో కమిషన్ ఏకపక్షంగా విచారణ జరిపింది. వినియోగదారుల రక్షణ చట్టం, 2019 ప్రకారం కంపెనీ తీరును భద్రతా ప్రమాదంగా, సేవలో స్పష్టమైన లోపంగా పేర్కొంది. లోపభూయిష్ట స్కూటర్‌ను వెనక్కి తీసుకుని, 2023 డిసెంబర్ 14 నుంచి 12 శాతం వార్షిక వడ్డీతో రూ. 1,28,000 తిరిగి ఇవ్వాలని ఆదేశించింది. అలాగే శారీరక, మానసిక వేదనకు రూ. 50,000, న్యాయ ఖర్చులకు రూ. 20,000 కలిపి మొత్తం రూ. 1.98 లక్షలను 45 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *