పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన వృద్ధ తల్లితో పాటు రెండు పెంపుడు కుక్కలను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం ఇంటి వెనుక ఉన్న ఖాళీ స్థలంలోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గుమ్తాలా ప్రాంతంలోని జుఝార్ సింగ్ అవెన్యూలో తీవ్ర కలకలం రేగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఒక్కసారిగా కాల్పులు.. ప్రాణాలు కోల్పోయిన తల్లి, కుక్కలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జుఝార్ సింగ్ అవెన్యూలోని 182వ నంబర్ ఇంట్లో హర్‌ప్రీత్ సింగ్ (50) తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. మంగళవారం (నవంబర్ 24) ఇంట్లో ఒక్కసారిగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. హర్‌ప్రీత్ మొదట తన రెండు పెంపుడు కుక్కల తలపై కాల్పులు జరిపాడు. అనంతరం తన వృద్ధ తల్లిని కూడా కాల్చి చంపాడు. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చి వెనుక ఉన్న ఖాళీ స్థలానికి వెళ్లి తనను తాను కాల్చుకున్నాడు. తీవ్ర గాయాలతో అతడు కూడా అక్కడికక్కడే మరణించాడు.
తృటిలో ప్రాణాలతో బయటపడిన కుటుంబ సభ్యులు
కాల్పులు జరిగిన సమయంలో హర్‌ప్రీత్ సింగ్ వదిన, ఆమె ఇద్దరు కుమార్తెలు ఇంట్లోని ఓ గదిలో నిద్రిస్తున్నారు. తుపాకీ శబ్దాలు విని వారు నిద్రలేచి బయటకు వచ్చారు. అప్పటికే హర్‌ప్రీత్ తల్లి, రెండు పెంపుడు కుక్కలు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో వారు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.
2021లో ఇంగ్లాండ్ నుంచి తిరిగొచ్చిన హర్‌ప్రీత్
పోలీస్ అధికారి దవీందర్ సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్‌ప్రీత్ సింగ్ 2021లో ఇంగ్లాండ్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి సరైన ఉద్యోగం లేకపోవడంతో కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అతను తరచూ పిస్టల్‌తో ఇంట్లో, వీధుల్లో తిరిగేవాడని కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. తల్లితో కూడా తరచూ గొడవలు జరిగేవని సమాచారం.
సీసీటీవీలో రికార్డైన ఘటన.. పోలీసుల దర్యాప్తు
ఇంట్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఈ ఘటన మొత్తం రికార్డయినట్లు హర్‌ప్రీత్ వదిన పోలీసులకు వెల్లడించారు. ఫుటేజీని పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న వెంటనే దవీందర్ సింగ్ తన బృందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) బృందం కూడా ఆధారాలను సేకరించింది.
పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హర్‌ప్రీత్ సోదరి వాంగ్మూలాన్ని నమోదు చేస్తూ, కాల్పులకు ఉపయోగించిన తుపాకీ, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ కలహాలా? మానసిక సమస్యలా? ఈ దారుణానికి అసలు కారణాలేమిటనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..