Headlines

ఇక బట్టతలకు బై బై.. ‘మ్యాజిక్ దువ్వెన’ వచ్చేసిందోచ్ !!


బట్టతల… నేటి కాలంలో యువతను తీవ్రంగా వేధిస్తున్న సమస్యల్లో ఒకటి. మారుతున్న కాలంతో పాటు ఆహారపు అలవాట్లు సహా ఇతర కారణాల వల్ల జుట్టు రాలడం, బట్టతల వంటివి ప్రధాన సమస్యలుగా మారాయి. చిన్న వయసులోనే జుట్టు పలుచబడటం, హెయిర్‌లైన్‌ వెనక్కి వెళ్లడం, చివరకు బట్టతల వచ్చే పరిస్థితులు చాలామందిలో కనిపిస్తున్నాయి. కాగా ఈ సమస్యకు పరిష్కారం కోసం ఎన్నో రకాల నూనెలు, షాంపూలు, మందులు ఉపయోగిస్తున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలోనే చైనా పరిశోధకులు అదిరిపోయే శుభవార్త ప్రకటించారు.

మ్యాజిక్ దువ్వెన..

‘డీట్యాంగిల్‌’ (Detangle) పేరుతో రూపొందించిన ఈ ఎలక్ట్రానిక్ దువ్వెన సాధారణ దువ్వెన మాదిరిగానే కనిపిస్తుంది. అయితే ఇందులో ప్రత్యేక విద్యుత్‌ ఎలక్ట్రోడ్లు, ఔషధాలను చర్మంలోకి పంపించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. బీజింగ్‌లోని బీహాంగ్‌ యూనివర్సిటీ పరిశోధకులు ఇతర సంస్థల శాస్త్రవేత్తలతో కలిసి దీనిని అభివృద్ధి చేశారు. ఈ పరికరంలోని వివిధ ఎత్తుల్లో ఉండే ఎలక్ట్రానిక్ పళ్లు విద్యుత్‌ క్షేత్రాలను సృష్టిస్తాయి. వీటి సహాయంతో జుట్టు కుదుళ్ల వరకు ఔషధాలను చేర్చవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా తలకు రాసే మందులతో పోలిస్తే ఈ విధానం ద్వారా ఔషధాలను వెంట్రుకల కుదుళ్ల ప్రాంతంలోకి దాదాపు తొమ్మిది రెట్లు లోతుగా పంపించవచ్చని వెల్లడించారు.

రెండు రకాల చికిత్సలు..

VEGFA జన్యు ఆధారిత చికిత్స: వెంట్రుకల కుదుళ్ల చుట్టూ రక్తనాళాల అభివృద్ధిని ప్రోత్సహించడమే ఈ చికిత్స లక్ష్యం. తద్వారా జుట్టు పెరుగుదలకు అవసరమైన పరిస్థితులను మెరుగుపరచవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

SRD5A2 జన్యువును లక్ష్యంగా చేసుకునే చికిత్స: జుట్టు రాలడానికి సంబంధం ఉన్న డీహైడ్రోటెస్టోస్టెరాన్‌ (DHT) హార్మోన్‌ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించే SRD5A2 జన్యువును లక్ష్యంగా చేసుకుని ఈ విధానాన్ని రూపొందించారు.

ఈ రెండు చికిత్సలతో పాటు విద్యుత్‌ ప్రేరణను ఉపయోగించడం ద్వారా జుట్టు తిరిగి పెరిగే ప్రక్రియను వేగవంతం చేయవచ్చని పరిశోధకులు వివరించారు.

28 రోజుల్లో 97.85 శాతం జుట్టు..

డీట్యాంగిల్‌ పరికరంపై నిర్వహించిన ప్రయోగాల్లో ఆసక్తికరమైన ఫలితాలు కనిపించాయి. అయితే ఈ ప్రయోగాలు మనుషులపై కాకుండా ఎలుకలపై నిర్వహించినట్టు స్పస్టం చేశారు. జుట్టు పెరుగుదలకు సాధారణంగా ఉపయోగించే మినాక్సిడిల్‌తో నిర్వహించిన ప్రయోగాల్లో సుమారు 70 శాతం వరకు పునరుద్ధరణ కనిపించినట్టు వివరిస్తున్నారు. అదే డీట్యాంగిల్‌ పరికరంతో రెండు ప్రయోగాత్మక చికిత్సలను కలిపి ఉపయోగించినప్పుడు 28 రోజుల్లో 97.85 శాతం వరకు జుట్టు తిరిగి పెరిగినట్లు అధ్యయనం వెల్లడించింది.

ఇక ఈ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతానికి డీట్యాంగిల్‌ పరికరం ప్రయోగాత్మక దశలోనే ఉంది. ఇప్పటివరకు దీనిని ఎలుకలపై మాత్రమే పరీక్షించారు. మనుషులపై కూడా ఇదే స్థాయిలో ఫలితాలు వస్తాయా? దీర్ఘకాలికంగా ఉపయోగించడం సురక్షితమేనా? ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి? అనే అంశాలపై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *