జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు మనిషి విజయానికి అవరోధాలు కావని నిరూపిస్తున్నారు గుజరాత్‌కు చెందిన డా. గణేష్ బరియా. కేవలం మూడు అడుగుల ఎత్తు, 20 కిలోల బరువు ఉన్న ఆయన ప్రస్తుతం భావ్‌నగర్ సివిల్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎన్నో అవమానాలు, సవాళ్లు ఎదురైనా పట్టుదలతో తన లక్ష్యాన్ని చేరుకుని ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా గోర్కి గ్రామానికి చెందిన గణేష్ బాల్యం ఎన్నో ఇబ్బందుల మధ్య సాగింది. ఆయన ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సర్కస్ నిర్వాహకులు గణేష్ తండ్రిని కలిసి ఐదు లక్షల రూపాయలు ఇస్తామని, తమతో పంపించాలని కోరారు. అయితే, ఆయన తండ్రి అందుకు అంగీకరించలేదు. ఈ ఘటన గణేష్‌పై తీవ్ర ప్రభావం చూపింది. జీవితంలో ఏదైనా సాధించి చూపించాలనే పట్టుదల ఆయనలో మరింత పెరిగింది.
చిన్న ఎత్తు కారణంగా పాఠశాలలో తోటి విద్యార్థుల నుంచి అప్పుడప్పుడు అవమానాలు ఎదురైనా చదువుపై ఆసక్తిని తగ్గించుకోలేదు. ప్రాథమిక పాఠశాల గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఆయన తండ్రి భుజాలపై ఎక్కించుకుని పాఠశాలకు తీసుకెళ్లేవారు. తొమ్మిదో తరగతిలో చేరే సమయంలో గణేష్ రూపాన్ని చూసి పాఠశాల సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ ఆయన చదువును కొనసాగించి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
ఆ తర్వాత నీట్ పరీక్షలో అర్హత సాధించి ఎంబీబీఎస్ చదవాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. కానీ ఆయన వైకల్యాన్ని కారణంగా చూపుతూ 2018లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) అడ్మిషన్‌కు అనుమతి నిరాకరించింది. దీంతో తన డాక్టర్ కావాలనే కల నెరవేరదేమోనని గణేష్ ఆవేదన చెందారు. ఈ సమయంలో ఆయన ఉపాధ్యాయులు దల్పత్ భాయ్, రజవంత్ భాయ్ అండగా నిలిచారు. ఎంసీఐ నిర్ణయాన్ని సవాలు చేస్తూ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వారికి అనుకూలంగా తీర్పు రాలేదు.
అయినా గణేష్ వెనక్కి తగ్గలేదు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో న్యాయపోరాటం కొనసాగించారు. చివరకు 2018 అక్టోబర్ 22న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వైకల్యం కారణంగా ఎంబీబీఎస్ ప్రవేశాన్ని నిరాకరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయం తెలుసుకున్న గణేష్ ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు గంటన్నర పాటు సుప్రీంకోర్టు ప్రాంగణంలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నో ఏళ్ల కల సాకారమయ్యే మార్గం తెరుచుకోవడంతో అది ఆయన జీవితంలో మరపురాని క్షణంగా నిలిచిపోయింది.
సుప్రీంకోర్టు తీర్పుతో ఎంబీబీఎస్ చదివే అవకాశం దక్కించుకున్న గణేష్.. ప్రస్తుతం తాను వైద్య విద్యను అభ్యసించిన భావ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. తొలినాళ్లలో తనను చూసి రోగులు ఆశ్చర్యపోయేవారని, క్రమంగా వారితో మంచి అనుబంధం ఏర్పడిందని చెబుతున్నారు. తన శారీరక ఆకృతి చిన్నపిల్లలతో సులభంగా మాట్లాడేందుకు ఉపయోగపడుతోందని ఆయన అంటున్నారు. ఇతర వైద్యులతో చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలను సైతం కొందరు రోగులు తనతో పంచుకుంటారని వివరించారు.
శారీరక పరిమితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని, ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చని డా. గణేష్ బరియా ప్రయాణం చాటిచెబుతోంది. తన జీవితంతో ఎంతోమందికి ఆశాకిరణంగా మారారు.