Headlines

3వేల పెట్టుబడితో 36 లక్షల ఆదాయం.. కారు డిక్కీనే షాపుగా మార్చి లక్షలు సంపాదిస్తున్న జంట


లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి సొంతంగా వ్యాపారం చేయాలంటే ఎవరికైనా కాస్త భయం వేస్తుంది. అందులోనూ భారీ పెట్టుబడి, ఖరీదైన దుకాణం లేకుండా వ్యాపారం మొదలుపెట్టడం అంటే సాహసమనే చెప్పాలి. కానీ అహ్మదాబాద్‌కు చెందిన దర్శన్, శృతి జింజువాడియా దంపతులు ఆ సాహసమే చేశారు. కేవలం రూ.2,000 నుంచి రూ. 3,000 పెట్టుబడితో తమ సొంత కారు డిక్కీలో ప్రారంభించిన చిరు వ్యాపారం, నేడు ఏడాదిన్నరలోనే ఏకంగా రూ. 36 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి చేరింది. దర్శన్ వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కాగా శృతి ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేసేవారు. 2025 జూలైలో స్నేహితుల సలహా మేరకు వీరు ది కోకో స్టేషన్ పేరుతో ఇంట్లోనే తయారుచేసిన కోల్డ్ కాఫీ, కోల్డ్ కోకో విక్రయాలను ప్రారంభించారు. మొదటి రోజు కేవలం 14 సీసాల కోల్డ్ కోకోను మాత్రమే సిద్ధం చేసుకుని కారు డిక్కీలో పెట్టుకుని అమ్మకానికి వెళ్లారు. ఆశ్చర్యకరంగా, విక్రయాలు మొదలుపెట్టిన కేవలం 40 నిమిషాల్లోనే ఆ 14 సీసాలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. కస్టమర్ల నుంచి వచ్చిన ఈ అనూహ్య స్పందన వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

పగలు ఉద్యోగం.. రాత్రి వ్యాపారం

మొదట్లో వీరిద్దరూ పగలంతా తమ రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తూనే, సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి రాగానే డ్రింక్స్ సిద్ధం చేసేవారు. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు అహ్మదాబాద్‌లోని గోటా ప్రాంతంలో తమ కారు డిక్కీనే షాపుగా మార్చి అమ్మకాలు జరిపేవారు. సోషల్ మీడియాలో వీరి గురించి ప్రచారం జరగడం, రుచికి కస్టమర్లు ఫిదా అవ్వడంతో రోజురోజుకూ డిమాండ్ విపరీతంగా పెరిగింది. దీంతో శృతి తన ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తి సమయాన్ని వ్యాపార విస్తరణకే కేటాయించారు.

రోజుకు రూ. 20 వేల ఆదాయం.. ప్రీమిక్స్ పౌడర్‌కూ భారీ డిమాండ్

ఒకప్పుడు రోజుకు 14 సీసాలు అమ్మడమే గగనంగా భావించిన ఈ దంపతులు.. ఇప్పుడు రోజుకు 150కి పైగా సీసాలను విక్రయిస్తున్నారు. దాంతో రోజుకు సుమారు రూ. 20,000, నెలకు రూ. 6 లక్షల వరకు ఆదాయాన్ని గడిస్తున్నారు. కేవలం 18 నెలల్లోనే రూ.36 లక్షల మార్కును దాటేశారు. ముఖ్యంగా గత నవరాత్రి ఉత్సవాల సమయంలో వీరు ఏకంగా 7,500 పైచిలుకు సీసాలను అమ్మి రికార్డు సృష్టించారు. వీరి కోల్డ్ కోకోకు ఉన్న క్రేజ్ చూసి, కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారి నుంచి రెడీ టు యూజ్ ప్రీమిక్స్ పౌడర్ కోసం ఆర్డర్లు వస్తుండటంతో ప్రస్తుతం ఆ విభాగంలోనూ వీరు రాణిస్తున్నారు.

కారు డిక్కీ నుంచి సొంత అవుట్‌లెట్ల వైపు అడుగులు..

ఈ వ్యాపారం కోసం దర్శన్, శృతి బయటి వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తీసుకోలేదు. వచ్చిన లాభాలనే తిరిగి వ్యాపారంలో పెట్టుబడిగా పెడుతూ అంచెలంచెలుగా ఎదిగారు. కారు డిక్కీలో మొదలైన వీరి ప్రస్థానం, త్వరలోనే ఒక భారీ అవుట్‌లెట్‌గా మారబోతోంది. రాబోయే కొన్నేళ్లలో నగరంలో 4 నుంచి 5 కొత్త బ్రాంచీలను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఈ యువ జంట దూసుకెళ్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *