రవ్వ లడ్డూలు, భారతీయ సంప్రదాయ స్వీట్లలో ఒకటిగా, దసరా వంటి పండుగలకు, ఇతర శుభకార్యాలకు ప్రాచుర్యం పొందినవి. వీటిని ఇంట్లో సులభంగా, రుచికరంగా తయారుచేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ/సూజీ): 2 కప్పులు, నెయ్యి: 1/4 కప్పు, జీడిపప్పు: ఒక గుప్పెడు, కిస్మిస్: కొన్ని, పచ్చి కొబ్బరి తురుము: 1 కప్పు, పంచదార: 1 3/4 కప్పు, యాలకులు: 5, గోరువెచ్చని పాలు.
తయారీలోకి వెళ్లితే.. ముందుగా, స్టవ్ పైన అడుగు మందం గల వెడల్పుగా ఉన్న ఒక పాన్ పెట్టుకుని 1/4 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. రెండు బాగా వేగిన తర్వాత నెయ్యి లేకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిగిలిన నెయ్యిలో రెండు కప్పుల బొంబాయి రవ్వను వేసుకోవాలి. మంటను తక్కువ నుండి మధ్యస్థం వరకు అడ్జస్ట్ చేసుకుంటూ, రవ్వ కమ్మటి వాసన వచ్చేవరకు, లేతగా రంగు మారేవరకు సుమారు 10 నిమిషాలు వేయించుకోవాలి. రవ్వ ఎంత బాగా వేగితే లడ్డూలు అంత రుచిగా ఉంటాయి. రవ్వ మాడిపోకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని వెడల్పుగా పరచి చల్లారనివ్వాలి.
అదే పాన్లో మళ్ళీ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మంటను తక్కువ నుండి మధ్యస్థం వరకు ఉంచి, కొబ్బరిలోని తడి ఆరిపోయి పొడిపొడిగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, కొబ్బరి ఎర్రగా, గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేవరకు వేయించుకోవాలి. ఇది లడ్డూలకు మంచి రుచిని, సువాసనను ఇస్తుంది. మీరు పచ్చి కొబ్బరి బదులుగా ఎండు కొబ్బరిని కూడా ఉపయోగించవచ్చు, అయితే దాన్ని కూడా కొద్దిగా వేయించుకోవాలి. వేయించిన కొబ్బరిని కూడా రవ్వ ఉన్న ప్లేట్లోకి వేసి, రవ్వతో బాగా కలుపుకోవాలి.
మిక్సీ జార్ తీసుకుని అందులో 1 3/4 కప్పుల పంచదార, 5-6 యాలకులు వేసి కొద్దిగా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ఇది లడ్డూలకు మంచి టెక్చర్ ఇస్తుంది. ఈ పంచదార పొడిని రవ్వ, కొబ్బరి మిశ్రమంలో వేసి బాగా కలిసేలా చేతితో కలుపుకోవాలి. ఇప్పుడు, 3/4 కప్పు గోరువెచ్చని పాలను కొద్దికొద్దిగా పోసుకుంటూ రవ్వ మిశ్రమాన్ని కలుపుకోవాలి. పాలను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా పోస్తూ, మిశ్రమం ముద్దగా, తడితడిగా అయ్యేవరకు కలుపుకోవాలి. లడ్డూలు చుట్టడానికి సరిపడా తడి అందేలా పాలను అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత, మిశ్రమాన్ని గట్టిగా నొక్కి పెట్టి, ఒక మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ 15 నిమిషాల నానబెట్టడం వల్ల రవ్వ పాలను పీల్చుకుని మరింత మృదువుగా మారుతుంది, లడ్డూలు గట్టిపడకుండా ఉంటాయి.
15 నిమిషాల తర్వాత, మూత తీసి మిశ్రమాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేసి మళ్ళీ కలపాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మీకు కావలసిన సైజులో మిశ్రమాన్ని తీసుకుని లడ్డూలుగా గట్టిగా చుట్టుకోవాలి. మిశ్రమం పొడిపొడిగా అనిపిస్తే, ఇంకా కొద్దిగా గోరువెచ్చని పాలను కలిపి చుట్టవచ్చు. అంతే టేస్టీ టేస్టీ లడ్డూ రెడీ. ప్రతి ఒక్కరూ వీటిని ఇష్టంగా తింటారు.




