Headlines

ఎక్కువ రుద్దాల్సిన పనిలేదు.. ఇలా చేస్తే గ్యాస్ స్టవ్ బర్నర్లు తళతళ మెరిసిపోతాయ్..


వంటగదిలో ప్రతిరోజూ వంట చేస్తుండటంతో గ్యాస్ స్టవ్ చుట్టూ నూనె, మసాలాలు, ఆహారపు రేణువులు పేరుకుపోతుంటాయి. తొలుత తేలికపాటి మరకలుగా కనిపించినా, సమయం గడిచేకొద్దీ అవి మందపాటి జిడ్డు పొరగా మారిపోతాయి. వీటిని వదిలించుకోవడానికి గంటల తరబడి రుద్దాల్సిన అవసరం లేదు. కొన్ని సులభమైన పద్ధతులతో తక్కువ శ్రమతోనే స్టవ్‌ను శుభ్రంగా మార్చుకోవచ్చు. స్టవ్ చుట్టూ స్వల్పంగా జిడ్డు పట్టి ఉంటే మైక్రోఫైబర్ వస్త్రం బాగా ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో గుడ్డను తడిపి, నీటిని బాగా పిండేసి జిడ్డు ఉన్న చోట కొద్దిసేపు ఉంచి మెల్లగా తుడవాలి. ఈ వస్త్రం నూనె, ధూళిని సులభంగా పీల్చుకుంటుంది. ఇక మూలలు, అంచుల వద్ద ఇరుక్కుపోయిన జిడ్డును తీయడానికి పాత టూత్‌బ్రష్ ఉపయోగించవచ్చు. బ్రష్‌కు కొద్దిగా డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి అంచులను సున్నితంగా రుద్దితే చేతులు పట్టని చోటు కూడా శుభ్రపడుతుంది. అయితే బ్రష్ బర్నర్ రంధ్రాలకు లేదా గ్యాస్ పైపులకు తగలకుండా జాగ్రత్త పడాలి.

మొండి మరకలు, గ్రిల్స్, బర్నర్ క్యాప్‌ల కోసం

మరింత జిడ్డుగా ఉన్నప్పుడు గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల డిష్‌వాషింగ్ లిక్విడ్, కొద్దిగా నిమ్మరసం కలిపి ద్రావణం తయారు చేసుకోవాలి. స్పాంజ్‌ను అందులో ముంచి స్టవ్ చుట్టూ తుడిస్తే మురికి సులువుగా వదులుతుంది. అలాగే స్టవ్ గ్రిల్స్, బర్నర్ క్యాప్‌లను గోరువెచ్చని నీరు, డిష్‌వాషింగ్ లిక్విడ్ ద్రావణంలో కొద్దిసేపు నానబెట్టాలి. తర్వాత మృదువైన బ్రష్‌తో రుద్ది, బాగా కడిగి, పూర్తిగా ఆరిన తర్వాతే తిరిగి అమర్చాలి.

శుభ్రం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

స్టవ్ క్లీన్ చేసే ముందు గ్యాస్ ఆఫ్ చేసి, ఉపరితలం పూర్తిగా చల్లారే వరకు వేచి చూడాలి. జిడ్డును తొలగించడానికి స్టీల్ స్క్రబ్బర్ లేదా కత్తి వంటి వాటిని వాడకూడదు; ఇవి స్టవ్ ఉపరితలాన్ని పాడు చేస్తాయి. బర్నర్ రంధ్రాలలోకి నీరు చేరకుండా చూడాలి, వేర్వేరు క్లీనర్లను ఒకదానితో ఒకటి కలపకూడదు. రోజూ వంట పూర్తయ్యాక స్టవ్ చుట్టూ ఒకసారి తుడిస్తే జిడ్డు మందంగా పేరుకుపోకుండా ఉంటుంది. ఈ చిన్న అలవాట్లు, జాగ్రత్తలు పాటిస్తే వంటగది ఎప్పుడూ శుభ్రంగా, గ్యాస్ స్టవ్ కొత్తదానిలా మెరుస్తూ ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *