Headlines

ట్రంప్ కోసం జైలుకెళ్లాడు.. టాటూ వేయించుకున్నాడు ..కట్ చేస్తే.. ట్రంప్‌ ద్రోహి అంటున్న అభిమాని!


Stewart Rhodes: ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే అతడికి ప్రాణం. ట్రంప్ కోసం జైలుకు వెళ్లేందుకు కూడా వెనుకాడలేదు. ఆయనపై ఉన్న అభిమానంతో ఏకంగా తన శరీరంపైనే ట్రంప్ ముఖాన్ని టాటూగా వేయించుకున్నాడు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఆరాధించిన వ్యక్తినే ఇప్పుడు ట్రంప్‌ ను అమెరికా చరిత్రలోనే అత్యంత నమ్మకద్రోహి అంటున్నాడు. అంతటితో ఆగకుండా తన శరీరంపై ఉన్న ట్రంప్ టాటూను కూడా మార్చేస్తానని ప్రకటించాడు అమెరికాలో వివాదాస్పద సంస్థగా పేరున్న ఓత్ కీపర్స్ వ్యవస్థాపకుడు స్టీవర్ట్ రోడ్స్.

ట్రంప్ కోసం జైలుకు.. 18 ఏళ్ల శిక్ష!

2020లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి అధికారాన్ని దక్కించుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలకు ఓటమి ఎదురైంది. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించడంతో ట్రంప్ పదవీకాలం ముగిసింది. అయితే ఈ ఓటమిని ట్రంప్ మద్దతుదారులు అంగీకరించలేకపోయారు. 2021 జనవరి 6న అమెరికా కాంగ్రెస్‌లో అధ్యక్ష ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ ప్రక్రియ కొనసాగుతుండగా ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన అమెరికా రాజకీయాల్లో తీవ్ర కలకలం సృష్టించింది. క్యాపిటల్ హిల్ దాడిగా పేరొందిన ఈ హింసాత్మక ఘటనలో ఓత్ కీపర్స్ అనే అతివాద సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు స్టీవర్ట్ రోడ్స్ పై దేశద్రోహ కుట్ర సహా పలు నేరాల్లో కోర్టు అతడిని దోషిగా తేల్చింది. దీంతో 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అలాంటి రోడ్స్ ఇప్పుడు ట్రంప్‌పై తన వైఖరిని పూర్తిగా మార్చుకున్నారు. ఒకప్పుడు గుడ్డిగా నమ్మిన నాయకుడి అసలు స్వరూపం ఇప్పుడు అర్థమైందంటూ విమర్శలు చేస్తున్నారు.

అయితే 2025 జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ రోడ్స్‌కు విధించిన శిక్షను తగ్గిస్తూ ఉపశమనం కల్పించారు. క్యాపిటల్ హిల్‌ దాడి కేసులో నిందితులుగా ఉన్న వందలాది మందికి పూర్తి క్షమాభిక్ష ప్రకటించిన ట్రంప్ రోడ్స్ విషయంలో మాత్రం శిక్షను మాత్రమే తగ్గించారు. పూర్తి క్షమాభిక్ష లభించకపోవడం కూడా ట్రంప్‌పై తన అభిప్రాయం మారడానికి ఒక కారణమని రోడ్స్ చెబుతున్నాడు.

‘ట్రంప్‌తో నా బంధం ముగిసింది’

తాజాగా టెక్సాస్‌లో జరిగిన ఓ సమావేశంలో రోడ్స్ ట్రంప్‌పై తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు. ‘నేను ట్రంప్‌తో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నాను. అమెరికా చరిత్రలో అత్యంత చెత్త దేశద్రోహుల్లో ఆయన కూడా ఒకరు’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకప్పుడు ట్రంప్‌పై ఎంతో నమ్మకం పెట్టుకున్నామని, వాషింగ్టన్‌లో పేరుకుపోయిన అవినీతిని అంతం చేస్తారని ఆశించామని చెప్పాడు. ‘డ్రెయిన్ ద స్వాంప్’ (ప్రభుత్వ వ్యవస్థలోని అవినీతిని ప్రక్షాళన చేయడం) అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ఇప్పుడు అదే అవినీతికి ప్రతిరూపంగా మారారని రోడ్స్ ఆరోపించాడు. ఆయన ప్రభుత్వం అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిమయమైన ప్రభుత్వాల్లో ఒకటని విమర్శించాడు. క్షమాభిక్షల వెనుక కూడా డబ్బు, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించాడు. ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం, జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన మరిన్ని ఫైళ్లను విడుదల చేయాలన్న డిమాండ్లపై ట్రంప్ వ్యవహరిస్తున్న తీరుపైనా రోడ్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ట్రంప్ టాటూ వెనుక కథ ఇదే!

ఆసక్తికర విషయం ఏంటంటే ట్రంప్‌పై తనకున్న అభిమానాన్ని రోడ్స్ మాటల్లోనే కాదు చేతల్లోనూ చూపించాడు. పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ట్రంప్‌పై హత్యాయత్నం జరిగినప్పుడు ఆయన ప్రాణాలతో బయటపడిన ఘటన రోడ్స్‌ను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆ సమయంలో జైలులో ఉన్న అతడు ట్రంప్‌పై అభిమానంతో ఆయన ముఖాన్ని తన శరీరంపై టాటూగా వేయించుకున్నాడు. అయితే ఇప్పుడు అదే టాటూ అతడికి ఇబ్బందిగా మారినట్లుంది. ట్రంప్‌ను దేశద్రోహిగా భావిస్తున్న రోడ్స్‌ ఆ టాటూను కూడా మార్చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘ట్రంప్ టాటూను మార్చి ఆయన చేసిన ద్రోహాన్ని ప్రతిబింబించేలా చేస్తాను’ అని రోడ్స్ స్పష్టం చేశాడు. అయితే టాటూను ఎలా మార్చబోతున్నాడనే విషయాన్ని చెప్పలేదు. 2025 ఆగస్టులో అమెరికా న్యాయశాఖ రోడ్స్‌పై ఉన్న నేరారోపణల తీర్పును రద్దు చేసింది. దీంతో అతడిపై ఉన్న నేరస్థుడి హోదా తొలగిపోయి, తిరిగి ఓటు వేసేందుకు, తుపాకులు కలిగి ఉండేందుకు అవకాశం లభించింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *