యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. మలయాళంలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హ్యాండ్సమ్ హీరో.. తెలుగులో సైతం తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ మధ్య మలయాళం డబ్బింగ్ సినిమాల కంటే కూడా ఎక్కువగా స్ట్రెయిట్ తెలుగు సినిమాల తోనే టాలీవుడ్‌ని పలకరిస్తున్నారు. ఇప్పటికే మహానటి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన దుల్కర్.. మొదటి సినిమాతోనే తనదైన నటనతో అభిమానులను సంపాదించుకోగలిగారు. ఆ తర్వాత సీతారామం సినిమాతో ఒక క్లాసిక్ హిట్ అందుకోగా.. లక్కీ భాస్కర్ మూవీతో బాక్సాఫీస్ వద్ద భారీగానే కలెక్షన్స్ కొల్లగొట్టారు.
కాగా రీసెంట్ గానే “ఆకాశంలో ఒక తార” అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్ గా పరిచయమైంది. శృతిహాసన్, రుహాని శర్మ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించగా.. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై నిర్మించారు. ఈ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ దక్కించుకొని ప్రేక్షకులను ఫుల్ ఫిదా చేస్తుంది. ఓ స్ఫూర్తిదాయకమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రంలో ఆయన నటన నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. భార్యకు అండగా నిలబడిన ఒక భర్తగా మర్చిపోలేని పర్ఫామెన్స్తో అదరగొట్టారు.
100% స్ట్రైక్ రేట్ హీరో..
సాధారణంగా పరభాషా హీరోలు వేరే భాషలో కూడా సక్సెస్ సాధించడం చాలా తక్కువే అని చెప్పాలి. రజినీకాంత్, కమల్ హాసన్ సహా అతి నతక్కువ మంది హీరోలు మాత్రమే తెలుగులో ఈ ఘనత సాధించగలిగారు. అయితే ప్రజెంట్ జనరేషన్ హీరోలలో అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా వరుసగా హిట్స్ కొట్టడం దుల్కర్ కి మాత్రమే సాధ్యమైందని జోరుగా చర్చ నడుస్తుంది. మరీ ముఖ్యంగా తన పాత్రకు డబ్బింగ్ సైతం తానే చెబుతూ అటు భాషపైనా పట్టు సాధించడం తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ చేసిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తంగా తెలుగులో దుల్కర్ మొత్తం నాలుగు స్ట్రైట్ సినిమాల్లో నటించగా.. అవన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. కల్కి 2898 ఏడీ, ఛాంపియన్ లో కామియో అప్పియరెన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో 100% స్ట్రైక్ రేట్ ఉన్న హీరోగా నిలిచారు. అంతే కాకుండా కథల ఎంపికలో తన నిర్ణయానికి తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు.
ఇక మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ సంపాదించుకున్నారు. ఓ వైపు యాక్షన్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు లవ్ స్టోరీస్, ఫీల్ గుడ్ మూవీలతో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈ యంగ్ హీరోకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉందనడంలో సందేహం అక్కర్లేదు. మలయాళంతో పాటు ఇతర భాషల్లో సైతం నటించి దక్షిణాదినే కాకుండా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.