ఒడిశా నుంచి కారులో బయలుదేరారు.. వయా ఏపీ నుంచి తెలంగాణ.. కరీంనగర్ వెళ్లాల్సి ఉంది. రోడ్డు దాదాపు ఖాళీగా ఉంది.. కొన్ని వాహనాలు మాత్రమే రాకపోకలు కొనసాగిస్తున్నాయి.. కారు అతి వేగంగా దూసుకువస్తోంది. మనకెవరూ అడ్డండూ డ్రైవర్ స్పీడుగా నడుపుతున్నాడు.. కారు లోపల ఏవో రెండు బస్తాలు కూడా ఉన్నాయి.. ఈ క్రమంలోనే.. కారు వేగంగా వెళుతూ.. అదుపుతప్పింది.. దారిన వస్తున్న రెండు వాహనాలను ఢీకొట్టింది.. కట్ చేస్తే.. పోలీసుల ఎంట్రీతో సంచలన నిజాలు వెలుగుచూశాయి. కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోవడంతోపాుట.. ఇద్దరిని అరెస్టు చేశారు.
వివరాల ప్రకారం..
పోలవరం జిల్లా ఎటాపాక వద్ద భారీగా గంజాయిని ఎటాపాక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందని, మొత్తం 35 కేజీల గంజాయిని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి ప్రాంతం నుంచి తెలంగాణలోని కరీంనగర్‌కు ఓ కారులో గంజాయిని తరలిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గంజాయిని తరలిస్తున్న క్రమంలో కారు అతివేగంగా ప్రయాణిస్తూ మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు.
కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 35 కేజీల గంజాయితో పాటు కీయా కారును సీజ్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Ganja Seized