Headlines

మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే మీ బ్యాంక్ ఖాతా ఖాళీ! పోలీసుల హై అలర్ట్


హైదరాబాద్‌లో నకిలీ ట్రాఫిక్ ఈ-చలాన్ మెసేజ్‌ల ద్వారా జరుగుతున్న సైబర్ మోసంపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాహనదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఎస్ఎంఎస్‌ల రూపంలో తప్పుడు సమాచారం పంపుతూ, అనుమానాస్పద లింకుల ద్వారా ఫోన్లలో ప్రమాదకరమైన యాప్‌లను చొప్పించే కుట్రకు పాల్పడుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.

హైదరాబాద్ ట్రాఫిక్ ఈ-చలాన్ విభాగం సబ్-ఇన్‌స్పెక్టర్ సి. రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒక సాధారణ మొబైల్ నంబర్ నుంచి వాహన నంబర్‌ను ప్రస్తావిస్తూ ట్రాఫిక్ చలాన్ పడిందనే సందేశం పంపబడుతోంది. అందులో అధికారిక ప్రభుత్వ లింకు అంటూ ఒక అనుమానాస్పద వెబ్ లింకును జత చేసి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. తొలుత ఒక నెటిజన్ సోషల్ మీడియా వేదికగా ఈ నకిలీ మెసేజ్ స్క్రీన్‌షాట్‌లతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులను అప్రమత్తం చేయగా, అధికారులు దీనిపై లోతుగా పరిశీలించారు.

నకిలీ ఎంపరివాహన్ APK ప్రమాదం

పోలీసుల పరిశీలనలో ఆ లింకుపై క్లిక్ చేసిన వెంటనే అసలు ఎంపరివాహన్ యాప్‌ను పోలిన నకిలీ APK ఫైల్ డౌన్‌లోడ్ అవుతున్నట్లు తేలింది. ఇటువంటి హానికరమైన ఫైళ్లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే, సైబర్ నేరగాళ్లు బాధితుల ఫోన్‌లోని వ్యక్తిగత డేటా, సున్నితమైన సమాచారంపై అనధికారిక నియంత్రణ సాధించే అవకాశం ఉంటుంది. దీనివల్ల వినియోగదారులకు భారీ ఆర్థిక నష్టాలు కలగడమే కాకుండా, వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుంది. అలాగే అధికారిక ట్రాఫిక్ ఈ-చలాన్ వ్యవస్థ విశ్వసనీయతపై కూడా దుష్ప్రభావం పడే ప్రమాదం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి



ప్రజలకు పోలీసుల సూచనలు

ఈ నకిలీ ఎస్ఎంఎస్‌లు, APK లింకులను రూపొందించి ప్రచారం చేస్తున్న వ్యక్తులను గుర్తించి, సంబంధిత మొబైల్ నంబర్లు, మూలాలను ఛేదించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు పలు జాగ్రత్తలు సూచించారు:

గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే మెసేజ్‌లలోని లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దు.

ఎస్ఎంఎస్‌ల ద్వారా వచ్చే లింకుల నుంచి ఎలాంటి APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవద్దు; అవసరమైతే అధికారిక యాప్ స్టోర్ల నుంచే యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ట్రాఫిక్ చలాన్ వివరాలను అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారానే నేరుగా తనిఖీ చేసుకోండి.

అనుమానాస్పద మెసేజ్‌లు వస్తే వెంటనే వాటిని విస్మరించి, పోలీసులకు సమాచారం అందించండి.

సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని, ఆర్థిక భద్రతను కాపాడుకోవచ్చని పోలీసులు స్పష్టం చేశారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *