Headlines

మన కర్రీలకు ప్రపంచం ఫిదా! టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్ లో నెంబర్ 4


Indian Curries Win Global Recognition Butter Chicken Ranks 4th Among Worlds Best Stews

తాజాగా ప్రముఖ ఫుడ్ గైడ్ టేస్ట్‌ అట్లాస్ (TasteAtlas) ప్రపంచంలోని అత్యుత్తమ స్టూ (stew) ల జాబితాను విడుదల చేసింది. వివిధ దేశాలకు చెందిన సంప్రదాయ వంటకాలకు ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో భారత్‌కు చెందిన రెండు వంటకాలు టాప్ 10లో నిలవడం విశేషం. ఒకటి మాంసాహార ప్రియుల ఫేవరెట్ అయితే.. మరొకటి శాకాహార ప్రియులు ఇష్టపడే వంటకం.

నాలుగో స్థానంలో బటర్ చికెన్.. గ్రేవీ రుచికి ఫిదా!

మన బిర్యానీకి, బటర్ చికెన్‌కు విదేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు భారతీయ వంటకాల రుచి మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటింది. ప్రపంచంలోని అత్యుత్తమ స్టూ (stew) ల జాబితాలో మన దేశానికి చెందిన రెండు ఫేమస్ కర్రీలు టాప్ 10లో చోటు సంపాదించుకున్నాయి. అందులో నాన్ వెజ్ ప్రియుల ఫేవరెట్ బటర్ చికెన్ నాలుగో స్థానంలో, వెజ్ లవర్స్ మనసు దోచుకునే షాహీ పనీర్ ఆరో ర్యాంక్ సాధించింది. టర్కీ, థాయ్‌లాండ్, పెరూ, ఫిలిప్పీన్స్ వంటకాలతో పోటీపడి ఈ ఘనత సాధించాయి. ఇంతకీ ఈ రెండు భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు? వాటి ప్రత్యేకతలేంటి?

చికెన్ అంటే ఇష్టపడేవారికి బటర్ చికెన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దీనినే ముర్గ్ మఖానీ అని కూడా పిలుస్తారు. ఢిల్లీలో పుట్టిన ఈ వంటకం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్లలో స్పెషల్ డిష్‌గా మారిపోయింది. ఈ కూర తయారీలోనే అసలు మ్యాజిక్ ఉంటుంది. ముందుగా చికెన్ ముక్కలకు పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వివిధ రకాల మసాలాలు పట్టించి కొంతసేపు నానబెడతారు. ఆ తర్వాత తందూరీ పద్ధతిలో ఉడికిస్తారు. మరోవైపు టమాటాలతో చిక్కటి గ్రేవీ తయారుచేసి అందులో వెన్న, క్రీమ్, సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. చివరగా ఈ గ్రేవీలో చికెన్ ముక్కలను వేసి ఉడికిస్తారు.

ఇక ఈ కూరలోని ప్రత్యేకత ఏమిటంటే.. కారం మరీ ఎక్కువగా ఉండదు. కొద్దిగా తీపి, పులుపు, వెన్న రుచి కలగలిసిన క్రీమీ గ్రేవీ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. వేడివేడి బటర్ నాన్, రూమాలీ రోటీ లేదా జీరా రైస్‌తో కలిపి తింటే ఆ రుచే వేరు. ఇలాంటి ప్రత్యేకతలతోనే ప్రపంచంలోని అత్యుత్తమ స్టూల జాబితాలో బటర్ చికెన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ఆరో స్థానంలో షాహీ పనీర్.. వెజ్ ప్రియులకు పండగే!

షాహీ పనీర్. పేరులోనే ఉన్నట్లుగా ఈ వంటకంలో రాజసం ఉట్టిపడుతుంది. ‘షాహీ’ అంటే రాజులకు సంబంధించినది లేదా రాజసం అని అర్థం. ఉత్తర భారతదేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ వంటకం ఇప్పుడు విదేశీయులనూ ఆకట్టుకుంటోంది. మెత్తటి పనీర్ ముక్కలను టమాటాలు, ఉల్లిపాయలు, జీడిపప్పు, క్రీమ్‌తో తయారుచేసిన చిక్కటి గ్రేవీలో ఉడికిస్తారు. యాలకులు, కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాలు ప్రత్యేక రుచిని అందిస్తాయి. కొద్దిగా తీపి, మసాలాల ఘాటు, క్రీమీ గ్రేవీ కలగలిసి అద్భుతమైన రుచిని ఇస్తాయి. వేడివేడి నాన్, పరాటా లేదా పులావ్‌తో షాహీ పనీర్‌ను కలిపి తింటే ఆ మజానే వేరు. పండుగలు, పెళ్లిళ్లు, ప్రత్యేక విందుల్లో ఈ కూరకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి షాహీ పనీర్ ప్రపంచంలోని అత్యుత్తమ స్టూల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది

ఇతర దేశాల వంటకాలు కూడా పోటాపోటీ!

ఇతర దేశాల సంప్రదాయ కర్రీలు ఈ జాబితాలో టాప్ 5లో చోటు సంపాదించుకున్నాయి. వాటిలో ప్రత్యేకమైన రుచులు, తయారీ విధానాలు ఇలా ఉన్నాయి.

సెకో డి కబ్రిటో – పెరూ: మేక మాంసంతో తయారుచేసే ఈ వంటకం పెరూలో ఎంతో ప్రసిద్ధి. మాంసాన్ని కొత్తిమీర, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరపకాయలు, మసాలాలతో నెమ్మదిగా ఉడికిస్తారు. కొన్నిసార్లు బీర్ లేదా మొక్కజొన్నతో తయారుచేసే సంప్రదాయ పానీయం కూడా కలుపుతారు. ప్రత్యేకమైన ఆకుపచ్చ రంగు గ్రేవీతో ఉండే ఈ వంటకాన్ని అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డిస్తారు.

ఫనాంగ్ కర్రీ – థాయ్‌లాండ్: కొబ్బరిపాలు, వేరుశెనగలతో తయారుచేసే ఈ కూర చిక్కటి గ్రేవీతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎండుమిర్చి, నిమ్మగడ్డి, వెల్లుల్లి, ఇతర మసాలాలతో కర్రీ పేస్ట్ తయారుచేస్తారు. అందులో కొబ్బరిపాలు కలిపి చికెన్, బీఫ్ లేదా పోర్క్‌తో వండుతారు. క్రీమీ రుచి, కొద్దిగా తీపి దీనికి ప్రత్యేక ఆకర్షణ.

హుంకార్ బెయెండి – టర్కీ: ఒట్టోమన్ రాజుల కాలం నాటి ఈ సంప్రదాయ వంటకం పేరు ఆసక్తికరం. ‘రాజుకు నచ్చింది’ అనేది దీని అర్థం. మటన్ లేదా బీఫ్ ముక్కలను టమాటా గ్రేవీలో ఉడికించి, కాల్చిన వంకాయతో తయారుచేసిన క్రీమీ పేస్ట్‌పై వడ్డిస్తారు. వెన్న, పాలు, చీజ్‌తో తయారయ్యే వంకాయ మిశ్రమం ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచిని అందిస్తుంది.

కరే కరే – ఫిలిప్పీన్స్: వేరుశెనగలతో తయారుచేసే చిక్కటి గ్రేవీ ఈ వంటకానికి ప్రత్యేక ఆకర్షణ. సాధారణంగా ఎద్దు తోక మాంసంతో తయారుచేస్తారు. కొన్నిసార్లు ఇతర మాంసం ముక్కలను కూడా ఉపయోగిస్తారు. అరటిపువ్వు, వంకాయ, చిక్కుడు వంటి కూరగాయలు వేస్తారు. దీనిని పులియబెట్టిన రొయ్యల పేస్ట్‌తో కలిపి తింటారు. తీపి, ఉప్పు, కమ్మదనం కలిసిన ప్రత్యేకమైన రుచి ఈ వంటకం సొంతం.

ప్రపంచ వేదికపై భారతీయ రుచుల జోరు!

ఒకవైపు మాంసాహార వంటకం బటర్ చికెన్ మరోవైపు శాకాహార వంటకం షాహీ పనీర్, రెండూ ప్రపంచంలోని అత్యుత్తమ స్టూ (stew) ల జాబితాలో చోటు దక్కించుకోవడం భారతీయ ఆహార వైవిధ్యానికి నిదర్శనం. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ భారతీయ రెస్టారెంట్లకు వెళ్లే వారిలో ఈ రెండు వంటకాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. మొత్తానికి మన వంటకాల రుచికి ప్రపంచమే ఫిదా అవుతోంది!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *