కావలసిన పదార్థాలు: లేత మటన్ అరకేజీ, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 5, దాల్చిన చెక్క చిన్న ముక్క, యాలకులు 4, జీలకర్ర అర టేబుల్ స్పూన్, జీడిపప్పు పలుకులు 15, ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, గసగసాలు 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు 1, అనాస పువ్వులు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పుదీనా తరుగు కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, పసుపు పావు టేబుల్ స్పూన్, కారం రుచికి సరిపడా, టమాటా 1, మటన్ మసాలా కొద్దిగా, నీళ్లు 1న్నర గ్లాసులు.
ముందుగా అరకేజీ లేత మటన్ తీసుకుని నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరకు అసలైన రుచినిచ్చే మసాలా పేస్ట్ కోసం స్టవ్ మీద చిన్న పాన్ పెట్టి ధనియాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీలకర్ర, జీడిపప్పు పలుకులు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి సన్నని మంటపై దోరగా వేయించాలి. చివరలో గసగసాలు వేసి ఒక్క నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ముందుగా పొడిలా చేసి, ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకుని పక్కన ఉంచాలి.
ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వులు వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి లేత గోధుమ రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి. ఇందులో అప్పుడే రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి, కొద్దిగా పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.
అనంతరం శుభ్రం చేసిన మటన్ ముక్కలు వేసి మంటను పెంచి కలుపుతూ వేయించాలి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి కలిపి, మూతపెట్టి సన్నని మంటపై మటన్‌లోని నీరు బయటకు వచ్చే వరకు మగ్గించాలి. ఆ తర్వాత కారం వేసి నూనె పైకి తేలేవరకు ఉడికించి, చిన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి.
ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్ వేసి ముక్కలకు బాగా పట్టేలా కలపాలి. గ్రేవీకి సరిపడా నీళ్లు, కొద్దిగా మటన్ మసాలా, కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆవిరి పోయిన తర్వాత మూత తీసి గ్రేవీ చిక్కబడే వరకు కాసేపు ఉడికించుకుంటే నోరూరించే తెలంగాణ స్టైల్ మటన్ కూర సిద్ధం.




