Headlines

కిడ్నీ ఇచ్చి భార్యకు ప్రాణం పోసిన భర్త.. చివరకు రోడ్డు ప్రమాదంలో విషాదం!


ఆరేళ్ల క్రితం ప్రాణాపాయ స్థితిలో ఉన్న భార్యకు తన కిడ్నీని దానం చేసి ఆమెకు పునర్జన్మ ప్రసాదించాడు ఓ భర్త. అనారోగ్యంతో పోరాడి కోలుకున్న భార్యతో కలిసి సంతోషంగా జీవితం కొనసాగిస్తున్నాడు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న సమయంలో విధి మరోసారి ఆ కుటుంబంపై పగబట్టింది. భర్తతో కలిసి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తున్న భార్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఒకప్పుడు తన కిడ్నీని ఇచ్చి భార్య ప్రాణాలు కాపాడుకున్న భర్త.. ఇప్పుడు ఆమెను శాశ్వతంగా కోల్పోయి కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని నెಲమంగల తాలూకా ఎడేహళ్లి వద్ద చోటుచేసుకుంది.

లగ్గెరెకు చెందిన శివాజీ రావు, వీణా భాయి (38) దంపతులు. శివాజీ రావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గురువారం రాత్రి దంపతులు సిద్దగంగ మఠానికి పూజల కోసం వెళ్లారు. దర్శనం అనంతరం బైక్‌పై ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో నెಲమంగల తాలూకా ఎడేహళ్లి సమీపంలో వారి బైక్‌ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఈ ప్రమాదంలో వీణా భాయిపై లారీ వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తర్వాత లారీని ఆపకుండా డ్రైవర్ అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది.

భార్య కోసం కిడ్నీ దానం చేసిన భర్త

ఆరేళ్ల క్రితం వీణా భాయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. లోబీపీ కారణంగా ఆమె రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో ఆమె పరిస్థితి విషమించింది. ఆ సమయంలో భార్యను ఎలాగైనా బతికించుకోవాలన్న తపనతో శివాజీ రావు తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకొచ్చారు. తనలోని ఒక కిడ్నీని భార్యకు ఇచ్చి ఆమె ప్రాణాలు కాపాడుకున్నారు. చికిత్స అనంతరం వీణా భాయి కోలుకోవడంతో దంపతులు మళ్లీ సాధారణ జీవితాన్ని కొనసాగించారు.

అయితే, తన కోసం కిడ్నీ ఇచ్చి ప్రాణాలు కాపాడిన భర్తతో కలిసి జీవితాన్ని కొనసాగిస్తున్న వీణా భాయి.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కళ్లముందే భార్యను కోల్పోయిన శివాజీ రావు ఆర్తనాదాలు అక్కడున్న వారిని కలచివేశాయి.

ప్రమాద సమాచారం అందుకున్న నెಲమంగల ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. వీణా భాయి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెಲమంగల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. లారీ డ్రైవర్ కోసం గాలిస్తూ, ప్రమాదానికి సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. తల్లిని కోల్పోయిన ఇద్దరు పిల్లలు, భార్యను కోల్పోయిన భర్త విషాదంలో మునిగిపోయారు. ఆరేళ్ల క్రితం కిడ్నీ దానం చేసి భార్యకు జీవితాన్ని అందించిన శివాజీ రావుకు.. ఇప్పుడు ఆమెను కోల్పోవడం తీరని వేదనగా మిగిలింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *