Headlines

బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!


రోజూ మనం ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు రకరకాల వార్తలు చదువుతుంటాం… వింటూ ఉంటాం. రాజకీయాలు, క్రైమ్, సినిమా విశేషాలు ఇలా ఎన్నో విషయాలు మన కళ్ల ముందు కదులుతుంటాయి. కొన్ని సంఘటనలు గురించి విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కలిగించడమే కాదు.. ఒళ్లు గగుర్పొడుస్తుంది కూడా. ఇప్పుడు అలాంటి సంఘటన గురించే మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఆశ్చర్యం కలిగించడమే కాదు.. మనం చెప్పుకోబోయే ఈ అంశం గురించి అవగాహన తెచ్చుకోవడం కూడా చాలా అవసరం. ఇంతకీ ఎం జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంజిల్లా సర్వజన ఆస్పత్రిలో వెలుగు చూసిన ఒక ఘటన అందరినీ నివ్వెరపోయేలా చేసింది. రాయదుర్గానికి చెందిన పదో తరగతి చదువుతున్న ఓ పదిహేనేళ్ల బాలిక కడుపులో ఏకంగా 750 గ్రాముల వెంట్రుకల ముద్ద పేరుకుపోయింది. వైద్యులు దానిని అత్యంత అరుదైన ఆపరేషన్‌ చేసి తొలగించారు. ఇప్పుడు ఈ ఘటన వైద్య వర్గాల్లోనూ, సాధారణ ప్రజల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. అసలు బాలిక కడుపులో అంతగా వెంట్రుకలు పేరుకుపోవడానికి కారణమేంటి? దీని వెనుక ఏమైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా.. అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. రాయదుర్గంలోని ఒక పాఠశాలలో పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలిక గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతోంది. మొదట్లో ఆమెకు తరచూ కడుపునొప్పి వస్తూ ఉండేది. తిన్న ఆహారం అరిగేది కాదు. విపరీతమైన వాంతులు అయిపోతూ ఉండేవి. అంతేకాదు.. ఆ బాలిక రోజురోజుకూ బరువు కూడా దారుణంగా తగ్గిపోతుంది. బాలిక పరిస్థితి ఏంటో అర్థం కాక కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. ఆస్పత్రులకు తీసుకెళ్తున్నారు.. వైద్యం చేయిస్తున్నారు కానీ..సమస్య మాత్రం కొలిక్కి రావడంలేదు. రోజు రోజుకీ బాలిక పరిస్థితి దారుణంగా తయారవుతోంది. సమస్య తీవ్రత పెరగడంతో భయపడిన తల్లిదండ్రులు ఆమెను ఎందుకైనా మంచిదని మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తీసుకువచ్చారు. అక్కడ వైద్యులు బాలిక పరిస్థితిని తెలుసుకొ,ఇ, వెంటనే రకరకాల అధునాతన పరీక్షలు చేసారు. స్కానింగ్‌లు చేసారు. ఆ తర్వాత వచ్చిన రిపోర్టులు చూసిన డాక్టర్లు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. బాలిక కడుపు నిండా వెంట్రుకలతో కూడిన ఒక పెద్ద గుట్ట పేరుకుపోయి ఉన్నట్లు తేలింది. రిపోర్టులు పరిశీలించిన వైద్యులు కుటుంబ సభ్యులను బాలిక గురించి ఆరా తీసారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఆ బాలిక చిన్నప్పటి నుంచీ తెలియకుండానే తన వెంట్రుకలను తినడమే కాకుండా ఇతరుల వెంట్రుకలను కూడా పీకి తినేదని చెప్పారు. వైద్య పరిభాషలో ఇలా జుట్టు తినే రుగ్మతను ‘ట్రైకోఫాజియా’ అంటారు. మనుషులు తినే ఆహారం జీర్ణమైనప్పటికీ, జుట్టులో ఉండే కెరాటిన్ వంటి పదార్థాలు మానవ జీర్ణవ్యవస్థలో ఎప్పటికీ జీర్ణం కావు. అలా చిన్నప్పటి నుంచి ఆ బాలిక తిన్న వెంట్రుకలు కొద్దికొద్దిగా కడుపులోనే పేరుకుపోయి ఒక పెద్ద ముద్దలా తయారయ్యాయి. దీనిని వైద్యులు ‘ట్రైకోబెజార్’ అని పిలుస్తారు. ఈ వెంట్రుకల ముద్ద కేవలం కడుపులోనే కాకుండా ఏకంగా పేగుల వరకు విస్తరించింది. వైద్య రంగంలో ఈ అత్యంత అరుదైన మరియు సంక్లిష్టమైన మానసిక-శారీరక పరిస్థితినే ‘రాంపుజెల్ సిండ్రోమ్’ అంటారు. ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా అరుదుగా కనిపించే అరుదైన కేసుల్లో ఒకటి. ఈకేసును సవాలుగా తీసుకున్న అనంతపురం సర్వజన ఆసుపత్రి సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ రామస్వామినాయక్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి.. మంగళవారం నాడు బాలికకు ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ ఆపరేషన్‌ చేశారు. ఆ తర్వాత గ్యాస్ట్రోటమీ విధానం ద్వారా కడుపులో పేరుకుపోయిన వెంట్రుకల ముద్దను ఎంతో నైపుణ్యంతో బయటకు తీశారు. వైద్యులు బయటకు తీసిన ఆ వెంట్రుకల ముద్దను కొలిచి చూస్తే అందరూ కంగుతిన్నారు. అది ఏకంగా 1.2 మీటర్ల పొడవుతో, 750 గ్రాముల బరువు ఉంది. చిన్నారి వయసుకు, ఆమె శరీర బరువుకు అంత పెద్ద మొత్తంలో వెంట్రుకలు కడుపులో ఉండటం అందరినీ విస్మయానికి గురిచేసింది. డాక్టర్ల బృందం సమయస్ఫూర్తి, అంకితభావం వల్లే ఈ క్లిష్టమైన ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం ఆ బాలిక కోలుకుంటోందని, ఆమె ఆరోగ్యం పూర్తిగా నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటన సమాజంలోని తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక లాంటిది. చిన్నపిల్లల్లో కొన్ని విచిత్రమైన మానసిక ప్రవర్తనా మార్పులు, గోళ్లు కొరకడం, వెంట్రుకలు తినడం, లేదా వింత వస్తువులను నోట్లో పెట్టుకోవడం వంటి అలవాట్లు కనిపిస్తుంటాయి. వీటిని చాలామంది పెద్దలు కేవలం అల్లరి అనుకుని తేలిగ్గా తీసుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, ఇలాంటి చిన్న అలవాట్లే కాలక్రమేణా ప్రాణాంతకమైన వ్యాధులుగా మారే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా, లేదా కడుపునొప్పి, వాంతులు, ఆకలి మందగించడం, విపరీతంగా బరువు తగ్గడం వంటి లక్షణాలు ఎదురైతే వెంటనే డాక్టర్లను సంప్రదించి సకాలంలో తగిన కౌన్సిలింగ్, వైద్యం అందించడం ఎంతో ముఖ్యం. ఏదేమైనా, అనంతపురం వైద్యుల చొరవతో ఆ పదిహేనేళ్ల బాలిక పునర్జన్మను పొందిందని చెప్పవచ్చు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వామ్మో.. గిరినాగు.. స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..

మనిషి మొహంలో పిల్లి రూపం.. బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి

Bird Flu: బర్డ్ ఫ్లూ టైమ్‌లో చికెన్ తినవచ్చా?

ఉదయం టీతో బిస్కెట్లు తీసుకుంటున్నారా? నెలరోజుల్లో మీ ఆరోగ్యంలో జరిగే మార్పు ఇదే!

సెలబ్రిటీలకే కాదు సామాన్యులకూ ముప్పే.. అలాంటి వాటిని కట్టడి చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *