Headlines

Telangana: రోడ్డుపై గాడిద కనిపిస్తే ఫసక్.. ఇలా మోపయ్యారు ఏంట్రా సామి.. !


రోడ్డుపై గాడిదలు కనిపిస్తే చాలు.. వాటిని మాయం చేసేందుకు పక్కా స్కెచ్ వేస్తారు. రాష్ట్ర సరిహద్దులు దాటించి విక్రయించి సొమ్ము చేసుకుంటారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గాడిదల దొంగతనాలకు తెరలేపిన ఓ ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు రట్టు చేశారు. గాడిదలను ఎత్తుకెళ్లేందుకు ఏకంగా బొలెరో పికప్ వాహనంతో రంగంలోకి దిగిన ఈ ముఠా ప్లాన్‌ను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు భగ్నం చేశారు.

నవంబర్ 19 తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండా సాంగ్వి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఏపీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ బొలెరో పికప్ వాహనం పోలీసులను చూసి ఒక్కసారిగా వెనక్కి తిరిగి పారిపోయేందుకు ప్రయత్నించింది. అనుమానం వచ్చిన పోలీసులు వెంటాడి వాహనాన్ని అడ్డుకున్నారు. అందులో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వారంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల ద్వారా వచ్చే ఆదాయం తమ ఖర్చులకు సరిపోవడం లేదని భావించిన నిందితులు.. ఈజీ మనీ కోసం దొంగతనాల బాట పట్టినట్లు విచారణలో వెల్లడైంది. సొంత ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తే సులభంగా దొరికిపోతామని భావించి తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలను లక్ష్యంగా చేసుకున్నారట. ముఖ్యంగా రోడ్లపై తిరిగే గాడిదలను అపహరించేందుకు పథకం రచించారు. ఇందుకోసం బొలెరో పికప్ వాహనాన్ని సిద్ధం చేసుకుని ఆదిలాబాద్‌కు చేరుకున్నారు. అయితే గాడిదల కోసం వెతుకుతుండగానే పోలీసుల తనిఖీలు ఎదురుకావడంతో వారి పథకం బెడిసికొట్టింది. గాడిద పాలు, మాంసం విక్రయాలకు ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆదిలాబాద్ వన్‌టౌన్ సీఐ బి. సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లకు చెందిన మాలిని నిఖిల్, ఇమ్రాన్, దేవరకొండ భవాని, ప్రకాశం జిల్లా పొంగులూరుకు చెందిన దేవరకొండ సాయి, చీరాలకు చెందిన దోలి సీను ముఠాగా ఏర్పడ్డారు. గాడిద పాలు, మాంసానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో రోడ్లపై తిరిగే గాడిదలను అపహరించి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని సీఐ వెల్లడించారు. వీరిపై ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్రలోనూ గాడిదల చోరీ కేసులు నమోదైనట్లు తెలిపారు.

మొత్తానికి గాడిదలను ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకోవాలనుకున్న ఐదుగురి పథకానికి పోలీసుల తనిఖీలు చెక్ పెట్టాయి. ఈ ఘటన నేపథ్యంలో పశువుల యజమానులు తమ జంతువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Donkey Theft Gang Arrested



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *