ఇతర హీరోలతో పోల్చితే హీరో వెంకటష్ కు మహిళా అభిమానులు ఎక్కువ. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్ సినిమాలు చేస్తోన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ముందుంటారు. రాజా, సూర్యవంశం, ప్రేమించుకుందాంరా, ప్రేమంటే ఇదేరా, పెళ్లి చేసుకుందాం, పవిత్ర బంధం, వసంతం, నువ్వు నాకు నచ్చావ్, మళ్లీశ్వరి, సంక్రాంతికి వస్తున్నాం, రీసెంట్ గా ఆదర్శ కుటుంబం.. ఇలా వెంకటేష్ ఫిల్మోగ్రఫీ చూస్తే ఎక్కువగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలే ఉంటాయి. అందుకే ఈ దగ్గుబాటి హీరోకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. ఇక వెంకీతో సినిమా అంటే స్టార్ హీరోయిన్లు కూడా పోటీ పడేవారు. అలా ఒక హీరోయిన్ కన్న తండ్రి వద్దన్నా వినకుండా వెంకటేష్ తో సినిమా చేసి సూపర్ హిట్ కొట్టింది. ఆమె మరెవరో కాదు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ సుందర్. ఇప్పుడంటే సినిమాలు తగ్గించింది కానీ ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మకు ఉండే క్రేజ్ వేరు. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా ఇండస్ట్రీని ఊపు ఊపేసిందీ ఖుష్బూ. తన అందం, అభినయంతో అప్పటి కుర్రకారును కట్టిపడేసిందీ అందాల తార. కాగా ఖుష్బూ తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది వెంకీ మొదటి సినిమాతోనే. అదే కలియుగ పాండవులు. ఆ మధ్యన ఓ టాక్ షోకు హాజరైన ఖుష్బూ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇదే క్రమంలో విక్టరీ వెంకటేష్ పరిచయం, అలాగే ‘కలియుగ పాండవులు’ సినిమా షూటింగ్ అనుభవాలను మరోసారి గుర్తుచేసుకున్నారీ అందాల తార.
కాగా అప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగొందుతోన్న ఖుష్బూ కు తెలుగు సినిమా ఆఫర్ రాగానే ఆమె తండ్రి వద్దన్నారట.
బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్దాం అని సలహా ఇచ్చారట. అయితే తండ్రి మాటను లెక్క చేయకుండా గొడవపెట్టుకుని మరీ తెలుగు సినిమాకు సైన్ చేశారట ఖుష్బూ. ‘రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ గారు హీరో అని చెప్పగానే.. ‘ఓ వావ్!’ అనుకున్నాను. ఇక రాఘవేంద్రరావు గారు దర్శకుడు అనగానే ఇది ఖచ్చితంగా ఒక భారీ బడ్జెట్ సినిమా అని అర్థమైంది. అంత పెద్ద బ్యానర్ వారసుడి సినిమా అంటే ఖచ్చితంగా గ్రాండ్ లాంచ్ అవుతుందని భావించాను. ఇక వెంకటేష్‌ను మొదటిసారి చూసిన క్షణం నా మనస్సులో ఇప్పటికీ చెరిగిపోలేదు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పాత ఇంట్లో.. వైట్ అండ్ వైట్ డ్రెస్సులో వచ్చి.. అమెరికనైజ్డ్ యాక్సెంట్‌తో ‘హాయ్, ఐ యామ్ వెంకీ!’ అని ఆయన పరిచయం చేసుకున్న విధానం ఇప్పటికీ నా కళ్లముందే ఉంది. 1985 డిసెంబర్ చివరిలో ఫోటో షూట్, 1986 జనవరి 1న చెన్నైలో మూవీ లాంచ్.. సౌత్ ఇండియాలో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో నా ప్రయాణాన్ని ప్రారంభించడం నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డిసిషన్. అప్పుడు అలా తీసుకోబట్టే.. ఆతరువాత టాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకుని స్టార్ గా మారాను’ అని అప్పటి క్షణాలను గుర్తు చేసుకున్నారు ఖుష్బూ. ప్రస్తుతం ఈ అందాల తార కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Venkatesh, Khushbu Sundar
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి