Headlines

టీవీకి బ్రేక్.. చదువుకు గ్రీన్ సిగ్నల్! AIతో తండ్రి మైండ్ బ్లోయింగ్ స్కెచ్!


Chinese Father Uses Ai To Make His Tv Addicted Son Answer School Questions Every 10 Minutes

దక్షిణ చైనా ప్రాంతం షెన్‌జెన్‌కు చెందిన ఓ వ్యక్తి ట్యాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు జూనియర్ సెకండరీ స్కూల్‌లో చదువుతున్నాడు. అయితే ఆ అబ్బాయికి చదువుకోవడం కంటే టీవీ చూడటంపైనే ఎక్కువ ఆసక్తి. గంటల తరబడి టీవీ ముందు కూర్చుంటూ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. దీంతో కొడుకు టీవీ చూసే సమయాన్ని తగ్గించాలని తండ్రి నిర్ణయించాడు. మొదట టీవీలోనే ఉన్న ప్రశ్నలు, సమాధానాల ఫీచర్ ద్వారా నియంత్రించేందుకు ప్రయత్నించాడు. కానీ కొడుకు ఆ పరిమితులను ఎలా దాటాలో కనిపెట్టేశాడు. దీంతో తండ్రి మరో ప్లాన్ వేశాడు. నిర్ణీత సమయం తర్వాత టీవీ ఆటోమేటిక్‌గా ఆఫ్ అయ్యేలా స్మార్ట్ ప్లగ్ ఏర్పాటు చేశాడు. కానీ కొడుకు తెలివి ముందు ఆ ప్రయత్నం కూడా పనిచేయలేదు. ప్లగ్‌ను తీసేసి మరీ టీవీ చూడటం కొనసాగించాడు. దీంతో తండ్రికి ఏం చేయాలో పాలుపోలేదు.

చివరకు AI రంగంలోకి.. తండ్రి మాస్టర్ ప్లాన్ ఇదే!

కొడుకును బలవంతంగా టీవీకి దూరం చేయడం కంటే.. టీవీ చూస్తూనే చదువుకునేలా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన తండ్రికి వచ్చింది. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయం తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అక్టోబర్‌లో ఓ AI అప్లికేషన్‌ను ఉపయోగించి ప్రత్యేకమైన క్విజ్ ప్రోగ్రామ్‌ను రూపొందించాడు. AI ఇచ్చిన ప్రాథమిక ప్రోగ్రామ్‌కు అవసరమైన మార్పులు చేసి టీవీలో ఇన్‌స్టాల్ చేశాడు. దీంతో కొడుకు టీవీ చూసే విధానమే పూర్తిగా మారిపోయింది.

ప్రతి 10 నిమిషాలకో ప్రశ్న

ఇప్పుడు ఆ అబ్బాయి టీవీ చూస్తున్న సమయంలో ప్రతి 10 నిమిషాలకోసారి తెరపై ఓ ప్రశ్న ప్రత్యక్షమవుతుంది. చైనీస్ భాష, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతుంది. స్కూల్‌లో పిల్లవాడు నేర్చుకున్న పాఠాలకు అనుగుణంగా ప్రశ్నల స్థాయిని కూడా సర్దుబాటు చేస్తుంది. అయితే ఇక్కడ ఓ కండిషన్ ఉంది. ప్రశ్నకు సరైన సమాధానం చెబితేనే మళ్లీ టీవీ కార్యక్రమాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఒకవేళ తప్పు సమాధానం చెబితే మరో ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఇలా సరైన సమాధానం వచ్చేవరకు టీవీ వినోదానికి బ్రేక్ పడుతుంది.

చదువు అంటే చిరాకు.. ఇప్పుడు ప్రశ్నల కోసం ఎదురుచూపులు!

మొదట్లో ఈ కొత్త విధానాన్ని కొడుకు ఎలా తీసుకుంటాడోనని తండ్రి భావించాడు. కానీ అనూహ్యంగా ఆ అబ్బాయి క్రమంగా ఈ ప్రశ్నలను ఆసక్తిగా స్వీకరించడం మొదలుపెట్టాడు. వాటిని శిక్షగా భావించకుండా ఓ ఆటలా తీసుకుంటున్నాడు. దీంతో తండ్రి సంతోషంగా ఉన్నాడు. భవిష్యత్తులో ప్రశ్నల స్థాయిని మరింత పెంచాలని భావిస్తున్నాడు. కొడుకు చదువులో మెరుగుపడటంతో పాటు సొంతంగా ఆలోచించి సమాధానాలు చెప్పడం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు.

ఈ ప్రయోగంలో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది. తన కొడుకు ఈ వ్యవస్థలోని లోపాలను గుర్తించి వాటిని దాటేందుకు ప్రయత్నించవచ్చని తండ్రి చెబుతున్నాడు. అలా కొడుకు కొత్త మార్గాలు వెతికితే వాటిని తాను సరిచేస్తానని అంటున్నాడు. ‘నా సిస్టమ్‌ను బ్రేక్ చేయడానికి అతను రకరకాల మార్గాలు ప్రయత్నించవచ్చు. నేను వాటిలోని లోపాలను సరిచేయడానికి ప్రయత్నిస్తాను. ఇది మా ఇద్దరికీ ఓ అభ్యాస ప్రక్రియ కాదా?’  అంటున్నాడు. కొడుకు సమస్యలను స్వయంగా పరిష్కరించుకునే స్థాయికి ఎదిగితే తన ప్రయత్నం విజయవంతమైనట్లేనని  అభిప్రాయపడ్డాడు.

ఇతర తల్లిదండ్రుల నుంచి ఆసక్తి!

ఈ వినూత్న ప్రయోగం చైనా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. షెన్‌జెన్ టీవీ కథనం ప్రకారం ఇతర తల్లిదండ్రులు కూడా తమ పిల్లల కోసం ఇలాంటి AI వ్యవస్థను ఎలా ఏర్పాటు చేసుకోవాలో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఈ ప్రోగ్రామ్‌ను ఎలా తయారు చేయాలి? టీవీకి ఎలా అనుసంధానించాలి? అనే విషయాలపై ఓ ట్యుటోరియల్ రూపొందించి అందించాలని ఆ తండ్రి భావిస్తున్నాడు. అయితే వివిధ టీవీ మోడళ్లలో భద్రత, గోప్యత సెట్టింగులు వేర్వేరుగా ఉండటంతో మరికొంత సమయం కావాలని తెలిపాడు.

మొత్తానికి టీవీ చూడొద్దని కొడుకుతో గొడవపడకుండా.. టీవీనే ఓ క్లాస్‌రూమ్‌గా మార్చేసిన ఈ తండ్రి ఆలోచన మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పిల్లల చేతిలో టెక్నాలజీ ఉంటే సమస్య అనుకునే రోజులు పోయాయి.. అదే టెక్నాలజీని తెలివిగా ఉపయోగిస్తే చదువుకు కూడా అద్భుతమైన సాధనంగా మార్చవచ్చని ఈ ఘటన నిరూపిస్తోంది!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *