Headlines

36 ఫ్రీజర్ బాక్సులు.. 61 మృతదేహాలు.. విజయవాడ మార్చురీలో దయనీయ పరిస్థితి!


విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి మార్చురీలో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. గుర్తుతెలియని మృతదేహాలు భారీగా పేరుకుపోవడంతో వాటిని భద్రపరిచేందుకు సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. మార్చురీలో 36 ఫ్రీజర్ బాక్సులు మాత్రమే ఉండగా.. ఏకంగా 61 మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒక్కో ఫ్రీజర్ బాక్సులో రెండు మృతదేహాలను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు నెలలుగా అనాథ మృతదేహాల గుర్తింపు, కుటుంబ సభ్యులకు అప్పగింత, అంత్యక్రియలు, ఖననం ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

పోలీస్ కమిషనర్ ఆగ్రహం..

మార్చురీలో మృతదేహాలు పేరుకుపోవడం, వాటి నిర్వహణలో నిర్లక్ష్యం చోటుచేసుకోవడంపై విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన గుర్తుతెలియని మృతదేహాల విషయంలో సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించడంపై సీరియస్ అయ్యారు. సాధారణంగా మృతదేహాలను అప్పగించే సమయంలోనూ జాప్యం జరుగుతుండటంతో మృతుల బంధువులు మార్చురీ వద్ద ఆందోళన చెందాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

అధికారులకు సీపీ మెమోలు..

మార్చురీలో స్థలం లేక కొత్తగా మృతిచెందిన వారి భౌతికకాయాలను భద్రపరిచేందుకు ఇబ్బందులు తలెత్తుతున్న విషయాన్ని సీపీ గుర్తించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంబంధిత పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, సీఐలు, ఏసీపీలకు మెమోలు జారీ చేశారు. పెండింగ్ కేసుల్లో మృతుల వివరాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. గుర్తింపు సాధ్యం కాని మృతదేహాలకు నిబంధనల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించి, మార్చురీని ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు.

మార్చురీలో మృతదేహాలు పేరుకుపోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, కొత్తగా వచ్చే మృతదేహాలను భద్రపరిచేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టి సారించడంతో సంబంధిత సిబ్బందిలో కలకలం మొదలైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *