Headlines

వాట్సాప్‌లో రాహుల్ ఫొటో.. ఫోన్‌లో PA అంటూ బిల్డప్.. చివరకు అడ్డంగా బుక్!


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కాంగ్రెస్ నాయకుడిని మోసం చేసేందుకు జరిగిన ప్రయత్నం కలకలం రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత సహాయకుడు (PA) అలంకార్ సవాయ్‌గా పరిచయం చేసుకుంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి కాంగ్రెస్ నేత అతుల్ లోంధేకు ఫోన్ చేశాడు. రాహుల్ గాంధీ నాగ్‌పూర్ పర్యటనకు వస్తున్నారని, నగరంలోని ప్రముఖ రాడిసన్ బ్లూ హోటల్‌లో రెండు ప్రీమియం సూట్లు బుక్ చేయాలని కోరాడు. అయితే ఫోన్ చేసిన వ్యక్తి గొంతుపై అనుమానం రావడంతో అతుల్ లోంధే అప్రమత్తమయ్యారు. దీంతో నిందితుడి మోసం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. నవంబర్ 8వ తేదీ రాత్రి సుమారు 9 గంటల సమయంలో అతుల్ లోంధే తన ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను అలంకార్ సవాయ్‌గా పరిచయం చేసుకుని, రాహుల్ గాంధీ నాగ్‌పూర్ పర్యటన నేపథ్యంలో హోటల్ గదులు బుక్ చేయాలని కోరాడు. అయితే మాట్లాడుతున్న సమయంలో గొంతుపై అనుమానం రావడంతో అతుల్ లోంధే నేరుగా రాహుల్ గాంధీ అసలు వ్యక్తిగత సహాయకుడు అలంకార్ సవాయిని సంప్రదించారు. తాను ఎలాంటి ఫోన్ చేయలేదని ఆయన స్పష్టం చేయడంతో ఇది నకిలీ కాల్ అని తేలిపోయింది.

మరోవైపు, అనుమానాస్పద వ్యక్తి వాట్సాప్ ప్రొఫైల్‌ను పరిశీలించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో రాహుల్ గాంధీ, అలంకార్ సవాయ్ ఫొటోలతో పాటు ‘PA Rahul Gandhi’ అనే పేరు ఉన్నట్లు గుర్తించారు. ఇతర కాంగ్రెస్ నాయకులకు కూడా ఇదే తరహాలో ఫోన్లు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై అతుల్ లోంధే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు నాగ్‌పూర్‌లోని నందన్‌వన్ పోలీసులు మోసం, ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మొబైల్ నంబర్, వాట్సాప్ ఖాతా వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు. ఈ మోసం వెనుక ఎవరున్నారు? మరికొందరు కాంగ్రెస్ నేతలు కూడా బాధితులయ్యారా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *