Headlines

నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్.. నవంబర్‌లో ‘రాజీవ్ యువ వికాస్’ పథకం ప్రారంభం!


తెలంగాణలో నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. యువత ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూపొందించిన ‘రాజీవ్ యువ వికాస్’ పథకాన్ని నవంబర్‌లో ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కింద ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను పారదర్శకంగా పరిశీలించి, అర్హులైన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలను ఆదేశించారు.

సోమవారం ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి భట్టి విక్రమార్క బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాల అమలు, విద్యార్థులకు అందుతున్న ఆర్థిక సాయం, గురుకులాల సమస్యలు, విదేశీ విద్య పథకం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన 1.3 లక్షల మంది విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో ట్యూషన్ ఫీజులు, స్కాలర్‌షిప్‌ల కింద రూ.450 కోట్లను నేరుగా జమ చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులకు అందాల్సిన ఆర్థిక సాయం సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు ఆహారం, సౌందర్య సాధనాల ఖర్చులను వారి ఖాతాల్లో క్రమం తప్పకుండా జమ చేయాలని స్పష్టం చేశారు.

40 వేల మందికి ‘కాటమయ్య రక్షణ కవచాలు’

బీసీ సంక్షేమ పథకాల అమలులో భాగంగా ‘కాటమయ్య రక్షణ కవచం’ పథకంపై కూడా సమీక్షించారు. ఈ పథకం కింద 50 వేల మందికి రక్షణ కిట్లు మంజూరు చేయగా, ఇప్పటికే 40 వేల మందికి పంపిణీ చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. మిగిలిన 10 వేల మందికి త్వరలోనే కిట్లు అందజేస్తామని వెల్లడించారు. ఈ రక్షణ కిట్ల కోసం ప్రభుత్వం రూ.60 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. బీసీ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.

బీసీ గురుకులాలకు శాశ్వత భవనాలు

బీసీ గురుకుల విద్యా సంస్థలకు సంబంధించిన పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

విదేశీ విద్య దరఖాస్తు గడువు పొడిగింపు

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. బీసీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఈ ఏడాది 180 మంది లబ్ధిదారులకు రూ.18.40 కోట్లను విడుదల చేసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. అర్హులైన విద్యార్థులందరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించేందుకు విదేశీ విద్య పథకం దరఖాస్తు గడువును అక్టోబర్ 15 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

ఆత్మగౌరవ భవనాలకు త్వరలో నిధులు

బీసీ వర్గాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి అవసరమైన నిధులను కూడా త్వరలో విడుదల చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో జాప్యం లేకుండా చూడాలని, పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో శాఖకు చెందిన సీనియర్ అధికారులు సైదులు, బాలమాయాదేవి, మల్లయ్యభట్టు, పద్మ, ఇందిర, శ్రీనివాస్ రెడ్డి, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *