Headlines

నిమ్స్‌ అధికారిపై అక్రమాస్తుల ఆరోపణలు.. కట్‌చేస్తే.. బార్బర్‌ ఇంట్లో రూ.7 లక్షల నగదు సీజ్


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నిమ్స్‌ అదనపు సూపరింటెండెంట్‌ లక్ష్మీ భాస్కర్‌కు సంబంధించిన వ్యవహారాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆయన అక్రమంగా సంపాదించిన ఆస్తులను ఇతరుల పేర్లపై పెట్టుబడులుగా మళ్లించారన్న సమాచారంతో మంగళవారం హైదరాబాద్‌లోని ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. లక్ష్మీభాస్కర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న వ్యక్తులతో పాటు నిమ్స్‌లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల ఇళ్లలోనూ తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లు, డైరీలు, బ్యాంకు లాకర్లకు సంబంధించిన తాళాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. సోదాల్లో భాగంగా నిమ్స్‌లో బార్బర్‌గా పనిచేస్తున్న ధనరాజు ఇంట్లో లెక్కల్లో చూపని రూ.7 లక్షల నగదు బయటపడటం చర్చనీయాంశంగా మారింది. ఈ నగదుకు లక్ష్మీభాస్కర్‌తో ఏమైనా సంబంధం ఉందా, ధనరాజు పేరును బినామీగా ఉపయోగించి ఆర్థిక లావాదేవీలు నిర్వహించారా అనే కోణాల్లో ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు.

ఇప్పటికే లక్ష్మీభాస్కర్‌పై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో ఆయన ఆదాయానికి మించి కోట్ల రూపాయల విలువైన స్థిర, చరాస్తులు కూడబెట్టినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన తనిఖీల్లో బంగారు ఆభరణాలు, విల్లాలు, ఓపెన్‌ ప్లాట్లు, వాణిజ్య ఆస్తులు, బ్యాంకు డిపాజిట్లకు సంబంధించిన పత్రాలు గుర్తించినట్లు సమాచారం.

కాంట్రాక్టుల కేటాయింపులు, ఔషధాల సరఫరా, ఆసుపత్రి కొనుగోళ్లలో తన అధికారాలను దుర్వినియోగం చేసి అక్రమంగా డబ్బులు కూడబెట్టారన్న ఆరోపణలపైనా దర్యాప్తు కొనసాగుతోంది. తాజా సోదాల్లో లభించిన ఆధారాలను విశ్లేషిస్తున్న ఏసీబీ అధికారులు.. లక్ష్మీభాస్కర్‌ ఆస్తులు, అనుమానిత బినామీల ఆర్థిక లావాదేవీల మధ్య ఉన్న సంబంధాలను పరిశీలిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *