Headlines

2 చపాతీలు ఎంత అన్నంతో సమానం.. మీకు తెలియని అసలు నిజాలు ఇవే..


2 చపాతీలు ఎంత అన్నంతో సమానం.. మీకు తెలియని అసలు నిజాలు ఇవే..

శరీర బరువును అదుపులో ఉంచుకోవడానికి, షుగర్‌ను నియంత్రించడానికి చాలామంది వెంటనే చేసే పని భోజనంలో అన్నాన్ని పూర్తిగా నిషేధించి రొట్టెలను చేర్చుకోవడం. ముఖ్యంగా దక్షిణాది వంటకాల్లో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుండగా, చపాతీలకు మారడం వల్ల అద్భుత ఫలితాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే వైద్య నిపుణులు, పోషకాహార శాస్త్రవేత్తల పరిశీలనల ప్రకారం ఈ మార్పు వెనుక ఉన్న గణాంకాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆహార కొలతల ప్రకారం.. ఒక సాధారణ గోధుమ రొట్టె ద్వారా లభించే శక్తి సుమారు 70 నుంచి 80 క్యాలరీల వరకు ఉంటుంది. అదే ఒక చిన్న కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకుంటే అది 130 నుంచి 150 క్యాలరీలను శరీరానికి అందిస్తుంది. అంటే లెక్క ప్రకారం ఎవరైనా రెండు రొట్టెలను తింటే, అది ఒక పెద్ద బౌల్ అన్నం తిన్న ఫలితంతో సమానమవుతుంది. కేవలం క్యాలరీలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం చాలా స్వల్పం.

అయితే శరీరంలో ఈ రెండు ఆహారాలు చూపే జీవక్రియల ప్రభావం ర్వేరుగా ఉంటుంది. పాలిష్ పట్టిన తెల్ల బియ్యంలో ప్రాసెసింగ్ కారణంగా పీచు పదార్థం దాదాపుగా నశిస్తుంది. దీని ఫలితంగా అది తిన్న వెంటనే శరీరంలో గ్లూకోజ్ వేగంగా కలిసిపోయి, ఇన్సులిన్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. దీనికి విరుద్ధంగా, ముతక గోధుమతో చేసిన రొట్టెల్లో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ పీచు పదార్థం జీర్ణక్రియను నెమ్మదింపజేసి, రక్తంలోకి చక్కెర నిదానంగా చేరేలా చేస్తుంది. అంతేకాకుండా కడుపు ఎక్కువ సమయం నిండిన అనుభూతిని కలిగించి, మాటిమాటికి ఆకలి వేసే అలవాటును అడ్డుకుంటుంది.

బరువు తగ్గడమనేది ఒక ఆహారాన్ని పూర్తిగా మానేయడంపై కాకుండా రోజువారీగా తీసుకునే పరిమాణం మీదే ఆధారపడి ఉంటుందని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. అన్నం తింటూ కూడా క్యాలరీల లోటును కొనసాగిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. అదే సమయంలో డయాబెటిస్ బాధితులు తెల్ల బియ్యానికి దూరంగా ఉంటూ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా నమోదయ్యే జొన్నలు, సజ్జలు లేదా కొర్రల వంటి చిరుధాన్యాలను ఎంచుకోవడం ఉత్తమ మార్గం. రాత్రి సమయాల్లో శారీరక శ్రమ తక్కువగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది.. కాబట్టి ఆ వేళల్లో తేలికపాటి ఆహారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *