
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా బ్యాంక్ ఖాతా నుంచి చెల్లించే యూపీఐ విధానం భారత్‌లో రోజువారీ జీవితంలో భాగమైంది. ఇలాంటి మార్కెట్‌లో యాపిల్ పే ప్రవేశం ఆసక్తికరంగా మారింది. తొలి దశలో POS మెషీన్లపై ట్యాప్ అండ్ పే సేవలు అందించే అవకాశం కనిపిస్తోంది. తర్వాత యూపీఐ సపోర్ట్ వస్తే మాత్రం దేశీయ డిజిటల్ చెల్లింపుల రంగంలో పోటీ మరింత పెరగొచ్చు. ఐఫోన్, యాపిల్ వాచ్ వాడేవారికి ఇది ప్రత్యేకంగా ఉపయోగపడనుంది.
క్రెడిట్ కార్డులతో ట్యాప్ అండ్ పే
భారత్‌లో యాపిల్ పే ప్రారంభ దశలో క్రెడిట్ కార్డుల ఆధారిత ట్యాప్ అండ్ పే సేవలతో రావచ్చని సమాచారం. POS మెషీన్‌పై కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఫోన్ లేదా వాచ్‌తో చెల్లింపు చేసే విధానం ఇది. తొలుత యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అయితే మొదటి దశలో క్యూఆర్ కోడ్ ఆధారిత యూపీఐ సదుపాయం లేకపోతే సాధారణంగా చిన్న మొత్తాల చెల్లింపులు చేసే వారికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండింటిలోనూ పనిచేస్తుండగా, యాపిల్ పే మాత్రం ఐఫోన్, యాపిల్ వాచ్‌లకే పరిమితం కానుంది.
మారే పరిస్థితులు
కొన్ని నివేదికల ప్రకారం భవిష్యత్తులో యాపిల్ పేకు యూపీఐ సపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే ఐఫోన్‌లో ప్రత్యేక యాప్ తెరవకుండానే చెల్లింపులు చేసే అవకాశం ఉంటుంది. ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీతో ధృవీకరణ పూర్తయ్యాక చెల్లింపు చేయొచ్చు. లాక్ స్క్రీన్ నుంచే పేమెంట్ చేసే సౌలభ్యం ఐఫోన్ వాడేవారికి ఆకర్షణగా మారొచ్చు.
ప్రస్తుతం ఫోన్‌పే, గూగుల్ పేలు భారత యూపీఐ రంగంలో బలమైన స్థానంలో ఉన్నాయి. తొలి దశలో క్రెడిట్ కార్డు చెల్లింపులకే పరిమితమైతే వాటిపై ప్రభావం తక్కువగా ఉండొచ్చు. భవిష్యత్తులో యూపీఐ సేవలను పూర్తిస్థాయిలో తీసుకొస్తే మాత్రం భారత డిజిటల్ చెల్లింపుల మార్కెట్‌లో పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది.