Headlines

మనీ ప్లాంట్‌కు ఆ పేరు ఎలా వచ్చింది..? ఇంట్లో ఉంటే నిజంగానే సంపద పెరుగుతుందా..!


లివింగ్ రూమ్ కార్నర్, రీడింగ్ టేబుల్, బాల్కనీ.. ఇలా ఎక్కడ చూసినా కనిపించే ఇండోర్ ప్లాంట్ మనీ ప్లాంట్. పెద్దగా శ్రమ పడకుండా, తక్కువ సంరక్షణతో ఇంటి అందాన్ని పెంచేందుకు చాలామంది దీనిని ఎంచుకుంటారు. అయితే ఈ మొక్కకు మనీ ప్లాంట్ అనే పేరు ఎందుకు వచ్చింది? దీన్ని ఇంట్లో పెట్టుకుంటే నిజంగానే సంపద పెరుగుతుందా? లేక దీని వెనుక ఉన్న ఇతర కారణాలు ఏంటి? అనేది ఎప్పుడైనా గమనించారా? ఈ మొక్క శాస్త్రీయ నామం ఎపిప్రెమ్నమ్ ఆరియమ్. ప్రపంచవ్యాప్తంగా మాత్రం దీనిని మనీ ప్లాంట్ అనే పిలుస్తారు. ఈ పేరు రావడానికి శతాబ్దాల చరిత్ర, కొన్ని ప్రాచీన జానపద కథలు, వాస్తు,ఫెంగ్‌షుయ్ నమ్మకాలతో పాటు కొన్ని ప్రత్యేక గుణాలు కూడా కారణమని చెబుతారు.

చైనా జానపద కథ.. అదృష్ట చక్రం

మనీ ప్లాంట్ పేరు వెనుక అత్యంత ప్రాచుర్యం పొందిన కథ ప్రాచీన చైనా నుంచి వచ్చింది. ఒక జానపద కథనం ప్రకారం.. తీవ్ర దారిద్య్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ పేదవాడు తన ఆర్థిక కష్టాలు తీరాలని భగవంతుడిని వేడుకున్నాడు. ఆ సమయంలో అతనికి అడవిలో వినూత్నంగా కనిపించిన ఈ మొక్క దొరికింది. దానిని ఇంటికి తెచ్చి శ్రద్ధగా పెంచాడు. ఆ తర్వాత ఆ మొక్క ద్వారా కొత్త దారులు తెరుచుకుని, అతను క్రమంగా వ్యాపారం చేసి ధనవంతుడయ్యాడు. నాటి నుంచి చైనీస్ సంస్కృతిలో ఈ మొక్కను అదృష్టానికి, ఆర్థిక శ్రేయస్సుకు చిహ్నంగా భావించడం మొదలుపెట్టారు. అలా దానికి మనీ ప్లాంట్ అనే పేరు స్థిరపడింది.

ఫెంగ్‌షుయ్, వాస్తు నమ్మకాలు

ఫెంగ్‌షుయ్ విధానం: చైనీస్ ఫెంగ్‌షుయ్ ప్రకారం మనీ ప్లాంట్ ఆకులు నాణేల మాదిరిగా గుండ్రంగా, నునుపుగా ఉంటాయి. అందుకే వీటిని డబ్బుకు ప్రతీకగా చూస్తారు. ఇంటి ఆగ్నేయ మూల సంపద దిశగా పరిగణించబడుతుంది కాబట్టి, అక్కడ ఈ మొక్కను ఉంచితే సానుకూల శక్తి, ఆర్థికాభివృద్ధి లభిస్తాయని నమ్ముతారు.

భారతీయ వాస్తు శాస్త్రం: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లోని ప్రతికూల శక్తులను దూరం చేసి, కుటుంబంలో శాంతి, సంతోషాలు, శ్రేయస్సు నిండేలా చేస్తుందని విశ్వసిస్తారు.

శాస్త్రీయ కోణంలో అర్థం

ఈ మొక్కకు ఆ పేరు రావడం వెనుక శాస్త్రీయ దృక్కోణం కూడా ఉంది. మనీ ప్లాంట్ ఎలాంటి వాతావరణాన్నైనా తట్టుకుని బతకగలదు. మట్టి అయినా, కేవలం సీసాలోని నీళ్లయినా.. తక్కువ వెలుతురు, స్వల్ప శ్రద్ధతోనే విపరీతంగా అల్లుకుపోతుంది. కష్ట పరిస్థితుల్లోనూ డబ్బును సరిగ్గా మదుపు చేసి కొత్త సంపదను సృష్టించినట్లే, ఈ మొక్క కూడా అతి తక్కువ వనరులతో వేగంగా కొమ్మలు వేసి పచ్చగా పెరుగుతుంది. దీని సహజసిద్ధమైన మనుగడ గుణాన్ని సూచిస్తూ కూడా మనీ ప్లాంట్ అని పిలుస్తుంటారు.

ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టినంత మాత్రాన రాత్రికి రాత్రే నోట్ల వర్షం కురవకపోవచ్చు కానీ.. ఇంటి వాతావరణాన్ని ఆహ్లాదకరంగా, పచ్చదనంతో ఉత్సాహంగా ఉంచడంలో మాత్రం ఈ మొక్క ముందుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *