Headlines

కెమెరా లేదు.. డిస్‌ప్లే లేదు! అయినా మీ మాటలను గుర్తుంచుకునే స్మార్ట్ గ్లాసెస్..


రోజంతా ఫోన్‌ను పదేపదే చూడటం తగ్గించాలనుకునేవారికి కొత్త రకం స్మార్ట్ గ్లాసెస్ అందుబాటులోకి వస్తున్నాయి. Vonderలో కెమెరా లేకపోవడంతో చుట్టూ ఉన్నవారిని చిత్రీకరించే అవకాశం ఉండదు. డిస్‌ప్లే కూడా లేకపోవడంతో కళ్ల ముందు సమాచారాన్ని చూపించదు. బదులుగా వాయిస్, AI మెమరీ ఆధారంగా పని చేస్తుంది. మీటింగ్‌లో చెప్పిన విషయాలు, నోట్స్ వంటి సమాచారాన్ని తర్వాత గుర్తు చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

ప్రైవసీకి ప్రాధాన్యం

Vonderలో కెమెరా, స్క్రీన్ రెండూ లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాసెస్ నిరంతరం ఆడియో రికార్డ్ చేయవు. యూజర్ బటన్ నొక్కినప్పుడు లేదా మీటింగ్ మోడ్ ఆన్ చేసినప్పుడు మాత్రమే రికార్డింగ్ ప్రారంభమవుతుంది. రికార్డింగ్ జరుగుతున్నట్లు ఇతరులకు తెలియజేసేందుకు చిన్న లైట్ కూడా వెలుగుతుంది.

రికార్డ్ చేసిన ఆడియోను వెంటనే టెక్స్ట్‌గా మార్చి, ఆడియో ఫైల్‌ను తొలగిస్తామని కంపెనీ చెబుతోంది. అయితే వ్యక్తిగత సమాచారాన్ని AI సేవలు ఎలా నిర్వహిస్తాయి, డేటా ఎక్కడ నిల్వ అవుతుంది అనే వివరాలను కొనుగోలు చేసే ముందు తెలుసుకోవడం మంచిది.

AI మెమరీతో ముఖ్యమైన విషయాలు..

ఈ గ్లాసెస్‌లో ‘Personal Memory Graph’ అనే AI వ్యవస్థ ఉంటుంది. మాట్లాడిన ముఖ్యమైన విషయాలు, నోట్స్ వంటి సమాచారాన్ని గుర్తుంచుకుని, అవసరమైన సమయంలో వాయిస్ కమాండ్ ద్వారా తిరిగి చెప్పగలదు. యాప్‌లో ChatGPT, Gemini, Claude వంటి AI మోడళ్లను ఉపయోగించే అవకాశం ఉంది. ఫోన్ చేతిలో లేకుండానే వాయిస్ కాల్స్ మాట్లాడేందుకు కూడా వీటిని ఉపయోగించొచ్చు.

బరువు సుమారు 30 గ్రాములు మాత్రమే కావడంతో సాధారణ కళ్లజోడులా ధరించవచ్చు. వివిధ రంగుల ఫ్రేమ్‌లు లభిస్తాయి. అవసరాన్ని బట్టి సైట్ అద్దాలు లేదా సన్‌గ్లాసెస్‌ను అమర్చుకునే అవకాశం ఉంది. కేవలం 25 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది.

అమెరికాలో సెప్టెంబర్ 28 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. నవంబర్ నుంచి డెలివరీలు మొదలవుతాయి. ప్రారంభ ధర సుమారు రూ.25 వేల వరకు ఉంటుంది. ఇతర దేశాల్లో విడుదల తేదీ, భారత మార్కెట్ ధరపై ఇంకా సమాచారం లేదు. మీటింగ్ నోట్స్, రిమైండర్లు, ప్రయాణ సమయంలో సమాచారం తెలుసుకోవడం వంటి పనులకు ఇది ఉపయోగపడనుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *