ఆసియా క్రీడలు 2026లో భారత మహిళల కబడ్డీ జట్టు అద్భుతం చేసింది. సెప్టెంబర్ 26న జరిగిన ఫైనల్‌లో ఇరాన్‌పై 37-34 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టుకుని మరోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో మూడో స్వర్ణ పతకం చేరింది. భారత్, ఇరాన్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ హోరాహోరీగా సాగింది. ఇరాన్ జట్టు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చింది. చివరి నిమిషంలో పాయింట్ల కోసం ఇరాన్ తీవ్రంగా ప్రయత్నించగా.. భారత రక్షణ విభాగం కీలక సమయంలో అద్భుత ప్రదర్శన చేసింది. అయనాజ్‌పై చేసిన కీలక ట్యాకిల్‌తో భారత్ విజయాన్ని ఖరారు చేసుకుంది. టోర్నీ మొత్తం అద్భుతంగా రాణించిన సంజు దేవి.. ఫైనల్‌లోనూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది.
భారత్ ఖాతాలో 27 పతకాలు
మహిళల కబడ్డీలో స్వర్ణంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 27కు చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 11 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. పతకాల పట్టికలో భారత్ 12వ స్థానంలో నిలిచింది. భారత మహిళల కబడ్డీ జట్టులో పూజ, రాజ్ రాణి, సోనాలి విష్ణు షింగాటే, పుష్ప, భావన దేవి, రీతూ, సంజు దేవి, రీతూ నేగి, మనీషా కుమారి, పింకీ రాయ్, జ్యోతి, నికితా సభ్యులుగా ఉన్నారు.
మరోవైపు పురుషుల మారథాన్‌లో సావన్ బర్వాల్ రజత పతకం సాధించాడు. 2 గంటల 11 నిమిషాల 37 సెకన్లలో రేసును పూర్తి చేసి జాతీయ రికార్డు నెలకొల్పాడు. ఆసియా క్రీడల మారథాన్‌లో భారత్‌కు 44 ఏళ్ల తర్వాత పతకం అందించాడు. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఆశి చౌక్సే, తిలోత్తమ సేన్, విదర్సా వినోద్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. వ్యక్తిగత ఫైనల్‌లో తిలోత్తమ నాలుగో స్థానంలో, విదర్సా ఐదో స్థానంలో నిలిచారు. స్క్వాష్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్‌లో హాంకాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్, లీ కా యీ జోడీ చేతిలో ఓటమి ఎదుర్కొన్న జోష్నా చిన్నప్ప, వెలవన్ సెంథిల్‌కుమార్ జంట కాంస్య పతకాన్ని సాధించింది. ఆర్చరీ పురుషుల రికర్వ్ క్వాలిఫికేషన్‌లో ధీరజ్ బొమ్మదేవర 698 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఆసియా, జాతీయ రికార్డులు నెలకొల్పాడు. మహిళల కాంపౌండ్ క్వాలిఫికేషన్‌లో చికితా తనిపర్తి 705 పాయింట్లతో మొదటి స్థానాన్ని సాధించింది.
బ్యాడ్మింటన్‌లో ఉన్నతి హూడా మలేషియాకు చెందిన వాంగ్ లింగ్ చినాను ఓడించి తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనిమేష్ కుజూర్ తన హీట్‌లో విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. ఫెన్సింగ్‌లో భారత మహిళల ఫాయిల్ జట్టు ఇండోనేషియాపై 45-24తో, పురుషుల సాబ్రే జట్టు ఫిలిప్పీన్స్‌పై 45-27తో విజయం సాధించాయి. అయితే క్వార్టర్ ఫైనల్స్‌లో ఓటమి ఎదుర్కొని టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
ఇదిలా ఉండగా, పురుషుల కబడ్డీ ఫైనల్‌లోనూ భారత్, ఇరాన్ జట్లు తలపడనున్నాయి. మహిళల జట్టు సాధించిన స్వర్ణంతో ఉత్సాహంగా ఉన్న భారత అభిమానులు.. పురుషుల జట్టు విజయంపై ఆశలు పెట్టుకున్నారు.