బీహార్ శాసన మండలి ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన సూరజ్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తిర్హుత్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన ఉపాధ్యాయ నేత భూషణ్ ఝా.. టికెట్ దక్కిన 24 గంటల్లోనే పార్టీకి రాజీనామా చేశారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
సెప్టెంబర్ 25న ముజఫర్‌పూర్‌లోని మాదిపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశం అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించే సమయంలో తనకు మద్దతుగా ఉన్న ఉపాధ్యాయులను సమావేశాన్ని రికార్డు చేయకుండా అడ్డుకున్నారని భూషణ్ ఝా ఆరోపించారు. అలాగే పార్టీ నిర్ణయానికి అనుగుణంగానే మాట్లాడాలని తనపై ఒత్తిడి తెచ్చారని పేర్కొన్నారు. ఈ వ్యవహారం తనకు అభ్యంతరకరంగా అనిపించిందని, సహచర ఉపాధ్యాయుల సూచనల మేరకు పార్టీని వీడి స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
భూషణ్ ఝా రాజీనామాతో తిర్హుత్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో జన సూరజ్ అభ్యర్థిత్వం మళ్లీ మారనుంది. కొత్త అభ్యర్థిని పార్టీ ప్రకటించాల్సి ఉంది. కేవలం ఒకరోజు వ్యవధిలోనే అభ్యర్థి పార్టీని వీడటం బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక బీహార్ శాసన మండలిలోని ఎనిమిది గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు అక్టోబర్ 23న పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 27న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ సెప్టెంబర్ 29న నోటిఫికేషన్‌తో ప్రారంభమై, అక్టోబర్ 31 నాటికి పూర్తికానుంది.
జన సూరజ్ తొలుత ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, సెప్టెంబర్ 24న మిగిలిన మూడు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించి మొత్తం ఎనిమిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. అందులో తిర్హుత్ గ్రాడ్యుయేట్స్‌కు డాక్టర్ విమోహన్ కుమార్, తిర్హుత్ టీచర్స్‌కు భూషణ్ ఝా, పాట్నా గ్రాడ్యుయేట్స్‌కు డాక్టర్ అనుజ్ సింగ్‌ను ప్రకటించింది. అయితే ఇప్పుడు భూషణ్ ఝా వైదొలగడంతో పార్టీ ఆ స్థానానికి కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..