Headlines

ఇక స్క్రీన్ ప్రొటెక్టర్‌ పైనా కేంద్రం రూల్స్? 2027 నుంచి అవే కొనాలా


షాపుల్లో తక్కువ ధరకు దొరికే టెంపర్డ్ గ్లాస్ ఇక గతంలోలా ఉండకపోవచ్చు. స్క్రీన్ ప్రొటెక్టర్ల తయారీలో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరి చేసేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. IS 19348:2025 ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేసిన ఉత్పత్తులకే మార్కెట్లో విక్రయానికి అనుమతి ఉండనుంది. దీంతో కొనేవారికి నాణ్యతపై నమ్మకం పెరిగే అవకాశం ఉన్నా, తయారీ ఖర్చులు పెరగడంతో ధరలపై ప్రభావం పడొచ్చు.

2027 నుంచి BIS సర్టిఫికేషన్ తప్పనిసరి

కొత్త నిబంధనల ప్రకారం BIS సర్టిఫికేషన్ అవసరమయ్యే ఉత్పత్తుల జాబితాలో మొబైల్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లను చేర్చారు. తయారీదారులు ‘IS 19348:2025’ భారతీయ ప్రామాణికం ప్రకారం వీటిని తయారు చేయాల్సి ఉంటుంది. BIS వద్ద రిజిస్ట్రేషన్, అనుమతి లేకుండా భారత మార్కెట్లో వీటిని చట్టబద్ధంగా విక్రయించడం కుదరదు. అయితే ఈ నిబంధనలు వెంటనే అమల్లోకి రావు. 2027 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్నారు.

దీంతో దేశీయ తయారీదారులతో పాటు విదేశాల నుంచి స్క్రీన్ ప్రొటెక్టర్లను దిగుమతి చేసుకునే బ్రాండ్లు, వ్యాపారులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతులు చేసుకునే సంస్థలు కొత్త ప్రమాణాలను పాటించాల్సి ఉంటుంది.

గ్లాస్ నాణ్యతపై కఠిన పరీక్షలు

కొత్త ప్రమాణాల్లో స్క్రీన్ ప్రొటెక్టర్ మందం, పరిమాణం, దృఢత్వం వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. యాంటీ షాటర్ ఫిల్మ్, ఆయిల్ మరకలు పడకుండా చేసే ఒలియోఫోబిక్ కోటింగ్, కళ్లకు ఇబ్బంది తగ్గించే యాంటీ గ్లేర్ ఫిల్మ్, బ్లూ-లైట్ ఫిల్టర్ వంటి అంశాలను కూడా పరీక్షించే అవకాశం ఉంది.

ఈ నిబంధనల వల్ల మార్కెట్లో నాణ్యత లేని స్క్రీన్ ప్రొటెక్టర్ల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. ఫోన్ డిస్‌ప్లేకు రక్షణ విషయంలో కొనేవారికి ప్రయోజనం కలగొచ్చు. అయితే ల్యాబ్ పరీక్షలు, ధ్రువీకరణ ప్రక్రియ వల్ల తయారీ ఖర్చులు పెరిగితే రాబోయే రోజుల్లో స్క్రీన్ ప్రొటెక్టర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. చిన్న బ్రాండ్లకు నిబంధనలు పాటించడం అదనపు భారంగా మారొచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *