Headlines

చనిపోయిందనుకున్నారు.. శవపేటిక నుంచి శబ్దం విని షాకైన కుటుంబం


చైనాలోని హెబెయ్‌ ప్రావిన్స్‌కు చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమెకు పదేళ్లకు పైగా సెరెబ్రల్‌ థ్రాంబోసిస్‌ సమస్య ఉంది. అంతేకాదు క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు చైనా మీడియా కథనాలు తెలిపాయి. ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో క్యాన్సర్‌కు చికిత్స చేయడం సాధ్యం కాదని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమెను ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులే సంరక్షిస్తున్నారు.

చనిపోయిందనుకుని.. శవపేటికలో పెట్టారు

సెప్టెంబర్‌ 8వ తేదీన కుటుంబ సభ్యులు ఆమెను పరిశీలించగా వారికి ఆమెలో ఎలాంటి కదలిక కనిపించలేదు. దాంతో ఆమె చనిపోయిందని భావించారు. వేరే ప్రాంతాల్లో ఉన్న బంధువులు వచ్చి చివరిసారిగా ఆమెను చూసుకునే వరకు మృతదేహాన్ని భద్రపరచాలని నిర్ణయించారు. అందుకోసం రిఫ్రిజరేషన్‌ సౌకర్యం ఉన్న శవపేటికలో ఆమెను ఉంచారు. అంతా ముగిసిపోయిందని కుటుంబ సభ్యులు భావించారు. కానీ మరుసటి రోజు సాయంత్రం ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

శవపేటిక లోపల నుంచి శబ్దం!

వృద్ధురాలి కోడలికి శవపేటిక లోపలి నుంచి చిన్నగా శబ్దం వినిపించింది. మొదట ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అనుమానం రావడంతో వెంటనే కుటుంబ సభ్యులను పిలిచింది. శవపేటికను తెరిచి చూడగా.. వృద్ధురాలు శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను బయటకు తీసుకొచ్చారు. కొంతసేపటికి ఆమె కళ్లు కూడా తెరిచినట్లు బంధువులు తెలిపారు. అయితే ఆమె చాలా బలహీనంగా ఉండటంతో ఆహారం, నీళ్లు కూడా సరిగా తీసుకోలేకపోయారు.

స్థానిక మీడియా కథనాల ప్రకారం..వృద్ధురాలిని డీప్‌ ఫ్రీజ్‌లో కాకుండా సాధారణ రిఫ్రిజరేటెడ్‌ శవపేటికలో ఉంచారు. ఆమె పరిస్థితిని వైద్యపరంగా ‘అప్పారెంట్ డెత్‌’ (Apparent Death) అని పిలుస్తారని వైద్యులు తెలిపారు.  ఆమె  అపస్మారక స్థితిలో ఉండటంతో .. అలాంటి పరిస్థితుల్లో శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం చాలా బలహీనంగా మారే అవకాశం ఉంది.

కొన్ని గంటలకే విషాదం..

అయితే కుటుంబ సభ్యులు ఆశ్చర్యంతో ఆమె బతికే ఉన్నట్లు గుర్తించినప్పటికీ.. ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు.సెప్టెంబర్‌ 11న, శ్వాస తీసుకుంటున్నట్లు గుర్తించిన కొన్ని గంటలకే ఆమె మళ్లీ కన్నుమూశారు. అనంతరం సెప్టెంబర్‌ 13న అంత్యక్రియలు నిర్వహించారు.

సోషల్ మీడియాలో చర్చ

ఈ ఘటనను కుటుంబ సభ్యుల్లో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. కొందరు నెటిజన్లు ఘటన నిజమేనా అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం తమ బంధువుకు సంబంధించిన విషయాన్ని కల్పించి చెప్పాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. కొంతమంది స్థానికులు కూడా ఈ ఘటన గురించి విన్నట్లు చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర అనారోగ్యంతో ఉన్న వ్యక్తుల్లో ప్రాణ లక్షణాలు చాలా బలహీనంగా ఉన్నప్పుడు మరణాన్ని నిర్ధారించేందుకు సరైన వైద్య పరీక్షలు ఎంత ముఖ్యమో మరోసారి చర్చకు వచ్చింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *