Headlines

శైలజ ఎంతకు తెగించింది.. అక్క మొగుడితో కలిసి భర్తను లేపేసిన భార్య..


కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జరిగిన హత్య కేసును పోలీసులు చేధించారు. అక్క మొగుడితో కలిసి భార్యే భర్తను చంపించిందని తెలిపారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని అమరావతి నగర్‌లో వివాహేతర సంబంధం, కుటుంబ కలహాల నేపథ్యంలో అరికెర గ్రామానికి చెందిన వీరేశ్ (మృతుడు) అనే వ్యక్తిని.. భార్య శైలజ.. అతడి తోడల్లుడు గిడ్డయ్యగారి వీరేశ్ దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. హత్య చేయించిన మృతుడి భార్య శైలజతో పాటు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమరావతి నగర్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లలో అక్క అఖిలను చిన్నహరివాణానికి చెందిన గిడ్డయ్యగారి వీరేశ్, చెల్లెలు శైలజను అరికెర గ్రామానికి చెందిన వీరేశ్ వివాహం చేసుకున్నారు. అయితే, గిడ్డయ్యగారి వీరేశ్ తన మరదలు శైలజతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసి భర్త అరికెర వీరేశ్.. భార్యతో తరచూ గొడవపడుతూ కొడుతుండేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక శైలజ తన బావతో మాట్లాడి, భర్తను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసింది..

ఈ క్రమంలో సెప్టెంబర్ 18న గణేష్ నిమజ్జనం కోసం కుటుంబ సభ్యులంతా అమరావతి నగర్‌కు వచ్చారు. ఆ సమయంలో భార్యపై ఆగ్రహంతో అరికెర వీరేశ్ ఆమె ఛాతీపై కాలితో తన్నాడు. ఆ తర్వాత ఆసుపత్రికి వెళ్లి వచ్చిన అనంతరం, నిందితుడు గిడ్డయ్యగారి వీరేశ్ తన మరదలి మాటలను మనసులో ఉంచుకుని అరికెర వీరేశ్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

సెప్టెంబర్ 18వ తేదీ అర్ధరాత్రి బహిర్భూమి నెపంతో బాధితుడిని బయటకు తీసుకెళ్లిన నిందితుడు, తన లుంగీతో అతడి గొంతు బిగించాడు. బాధితుడు ప్రతిఘటించే క్రమంలో నిందితుడి చేతులు, వీపుపై కొరికినప్పటికీ.. నిందితుడు అతడిని నేలపై పడేసి శైలజ పచ్చబొట్టు ఉన్న ఛాతీ భాగంలో కత్తితో పొడిచి పరారయ్యాడు.

హత్యకు పిలిపించిన శైలజను, ప్రత్యక్షంగా హత్యకు పాల్పడిన గిడ్డయ్యగారి వీరేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదోని వన్ టౌన్ సీఐ పి. చంద్రశేఖర్ తెలిపారు. కాగా ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *