Headlines

School Holiday: భారీ వర్షాల ఎఫెక్ట్.. ఆ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు.. అధికారుల అలర్ట్..


బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం తెలుగు రాష్ట్రాలను గడగడలాడిస్తుంది. తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెంది.. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ తీరప్రాంతం వైపు శరవేగంగా ముంచుకొస్తోంది. విశాఖపట్నం – గోపాల్‌పూర్ రేవుల మధ్య ప్రాంతాన్ని కేంద్రీకృతం చేసుకుని బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇది తీరాన్ని తాకే అవకాశాలున్నట్లు వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఈ ప్రభావంతో గంటకు 70 కిలోమీటర్ల పెనుగాలులతో పాటు కోస్తా తీరం వెంబడి ఆకాశానికి చిల్లు పడ్డ రీతిలో వర్షాలు కురుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు..

ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో విపత్తు నివారణ శాఖ ఆయా జిల్లాలకు అత్యున్నత స్థాయి రెడ్ అలర్ట్ ప్రకటించింది. విశాఖ, అనకాపల్లి, అల్లూరి ఏజెన్సీ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది. ఇప్పటికే మొదలైన ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉగ్రరూపం దాలుస్తుండటంతో అధికార యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. విజయనగరం, మన్యం జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించారు. రహదారులపై వరద నీరు పోటెత్తడంతో పలు కీలక మార్గాల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేసి, ప్రయాణికులను అప్రమత్తం చేశారు.

సముద్రం తీవ్రస్థాయిలో అల్లకల్లోలంగా మారిన నేపథ్యంలో విశాఖ, గంగవరం, కళింగపట్నం నౌకాశ్రయాల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను అమల్లోకి తెచ్చారు. వేటకు వెళ్లిన బోట్లను వెనక్కి పిలిపించడంతో పాటు రాగల రెండు రోజుల పాటు మత్స్యకారులు జలాల్లోకి అడుగుపెట్టవద్దని స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. శ్రీకాకుళం నుంచి బాపట్ల వరకు తీరమంతా హై అలర్ట్‌లోకి వెళ్లింది.

మరోవైపు ఈ తుపాను ప్రభావం తెలంగాణపైనా తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశముంది. సరిహద్దు అటవీ, గోదావరి పరీవాహక ప్రాంతాలైన పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన కుండపోత వర్షాలు పడే అవకాశం ఉండటంతో లోతట్టు గ్రామాలు, కాలనీల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కంట్రోల్ రూమ్‌లను సిద్ధం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *